‘జాతి రత్నాలు’ సీక్వెల్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: ఆయన రాకతో అదనపు బలం
పెద్ద పెద్ద స్టార్లు లేరు.. పేరున్న దర్శకుడూ కాదు.. సీనియర్ నిర్మాణ సంస్థ కూడా కాదు.. అయినా సాలిడ్ హిట్ కొట్టి బాక్సాఫీస్ బూజు దులిపేసిన చిత్రం 'జాతి రత్నాలు'. నవీన్ పోలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పెద్దగా హడావిడి, ఆర్భాటాలు లేకుండానే విడుదలైంది. కానీ, ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. అదే సమయంలో కలెక్షన్లనూ భారీగానే కొల్లగొట్టింది. దీంతో ఈ ఏడాది విడుదలైన టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇంత సక్సెస్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది. తాజాగా దానికి సంబంధించిన ఓ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
'జాతి రత్నాలు' మూవీలో హీరో నవీన్ పోలిశెట్టి అతడి గ్యాంగ్ జోగీపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు చూపించారు. అయితే, ఈ మూవీ సీక్వెల్‌లో మాత్రం వీళ్లంతా అమెరికా వెళ్లి అక్కడ రచ్చ చేసింది చూపించబోతున్నట్లు దర్శకుడు ఇటీవలే ఓ హింట్ ఇచ్చాడు.

ఇక, డైరెక్టర్ అనుదీప్ కేవీ ఇప్పటికే ఈ సినిమా కథపై వర్క్ మొదలు పెట్టాడట. తాజా సమాచారం ప్రకారం.. అతడికి నాగ్ అశ్విన్ కథా సహకారం చేస్తున్నాడని తెలిసింది. మొదటి భాగానికి నిర్మాతగా చేసిన అతడు.. సీక్వెల్‌కు మాత్రం క్రియేటివ్‌గా సహాయం అందించబోతున్నాడట. ఇది సినిమాకు మరింత బలం కానుందన్న టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. 'జాతి రత్నాలు' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.52 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 27.02 కోట్ల లాభాలను అందుకుంది. ఇక, ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్‌పై 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. రాధన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది.


Click it and Unblock the Notifications











