సమంతతో అప్పుడు అలా.. శోభితతో ఇప్పుడు ఇలా.. నాగచైతన్యలో ఇవి గమనించారా?
అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శోభితతో ప్రేమలో ఉన్న చైతూ .. సైలెంట్‌గా నిశ్చితార్ధం చేసుకుని అందరికీ షాకిచ్చారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నా చివరికి హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో సమంత అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు. శోభితతో నాగచైతన్య వివాహం నేపథ్యంలో సమంతతో అప్పుడు పెళ్లి ఎలా జరిగింది? ఇప్పుడు శోభితతో ఎలా జరగబోతోంది అంటూ పోల్చి చూస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేశావో సినిమా షూటింగ్ సమయంలో సమంతతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. అయితే అప్పట్లో నాగచైతన్య - సమంతల పెళ్లి హాట్ టాపిక్‌గా నిలిచింది. సమంత ఆచరించే క్రిస్టియన్ సాంప్రదాయంతో పాటు , నాగచైతన్య అనుసరించే హిందూ సాంప్రదాయంలో రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.

2017 అక్టోబర్ 6, 7 తేదీలలో గోవాలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులైన వారు దాదాపు 100 మంది వరకు వీరి వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో నాగార్జున ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్‌కు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.
అయితే కొన్నాళ్లు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఈ జంట విడిపోయింది. తన పేరుకు ముందున్న అక్కినేని అన్న ఇంటిపేరు తీసేయడంతో పాటు గతంలో నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల నుంచి సమంత తొలగించడంతో వీరి విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. చైతన్య - సమంతల విడాకుల ఎపిసోడ్‌తో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఎంతో మనోవేదనకు గురయ్యారు. కట్ చేస్తే .. విడాకుల అనంతరం చైతన్య, సమంతలు ఎవరి దారులు వారు చూసుకుని కెరీర్‌పై ఫోకస్ పెట్టారు.

సమంతతో విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న నాగచైతన్య.. శోభిత ధూళిపాళతో ప్రేమలో పడి ఆమెతో ఏడడుగులు నడవబోతున్నారు. సమంతతో రెండు సార్లు , రెండు విధానాలలో పెళ్లి చేసుకున్న చైతూ ఈసారి మాత్రం పూర్తిగా హిందూ సాంప్రదాయంలోనే శోభిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. ఇప్పటికే వధువరుల ఇళ్లలో పసుపు కొట్టడంతో పాటు మంగళ స్నానాలు, పూజలు ఇతర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
బుధవారం రాత్రి 8.13 గంటలకి శోభిత ధూళిపాళ మెడలో చైతూ తాళి కట్టనున్నారు. స్టూడియో ఆవరణలోని నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి ఎదురుగా వేదికను ఏర్పాటు చేశారు. కొత్త దంపతులకి తాతగారి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే నాగచైతన్యను ముత్తయిదువులు మంగళ స్నానాలు చేయించి పెళ్లి కొడుకుగా చేశారు. దాదాపు ఏడు ఏనిమిది గంటల పాటు వీరి పెళ్లి క్రతువు జరుగుతుందని సమాచారం. ఇక పెళ్లి సందర్భంగా తరలివచ్చే అతిథుల కోసం నోరూరించే మెనూని తయారు చేయించారట నాగార్జున.


Click it and Unblock the Notifications











