ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పిన నాగ చైతన్య: ఏకంగా వాళ్లందరితో దిగిన ఫొటోతో క్లారిటీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. మొదట్లోనే పలు విజయాలను అందుకున్న అతడు.. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో అతడి కెరీర్ మసకబారిందన్న కామెంట్లు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో శివ నిర్వాణ తెరకెక్కించిన 'మజిలీ' మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడని నాగ చైతన్య.. ఆ తర్వాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ 'వెంకీ మామ'తో మరో సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు.
వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న నాగ చైతన్య.. గత ఏడాది శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అందులో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న 'థ్యాంక్యూ' మూవీ ఒకటి. మనం వంటి ఫీల్ గుడ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'థ్యాంక్యూ' మూవీ షూటింగ్‌కు పలుమార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో చిత్రీకరణకు పలుమార్లు బ్రేకులు పడ్డాయి. ఫలితంగా ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కోసం షూటింగ్‌ను పున: ప్రారంభించారు. అప్పటి నుంచి శరవేగంగా జరుపుతూ తాజాగా టాకీ పార్ట్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఈ మేరకు యూనిట్ సభ్యులందరూ కలిసి దిగిన ఓ ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. నాగ చైతన్య నటించిన 'థ్యాంక్యూ' మూవీని ఓటీటీలో విడుదల చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ గురించి వస్తున్న వార్తలను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఖండించింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో 'థ్యాంక్యూ మూవీ ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మీ అందరికీ బిగ్ స్క్రీన్ మీద మధురానుభూతిని కలిగించేందుకు మేమంతా ఎంతో అంకిత భావంతో ఈ సినిమా పనులు చేస్తున్నాం. సమయం వచ్చినప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాం. అప్పటి వరకూ వచ్చే వార్తలను ఏమాత్రం నమ్మకండి' అని వివరించింది.
'థ్యాంక్యూ'లో నాగ చైతన్య రెండు విభిన్నమైన గెటప్‌లతో కనిపించనున్నాడు. అంతేకాదు, ఇందులో అతడు మహేశ్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ అవికా గోర్ కీలక పాత్రను చేస్తోంది.


Click it and Unblock the Notifications











