Love Story Theatrical Trailer: నవ్వించి ఏడిపించిన రేవంత్, మౌనిక.. ప్రేమిస్తే చంపేస్తరు!
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీ ప్యూర్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన రూపొందించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీనికి తోడు దీని నుంచి విడుదలైన పాటలు, టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో అందరి దృష్టీ ఈ చిత్రంపైనే పడింది. ఫలితంగా ఇది ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వాస్తవానికి 'లవ్ స్టోరీ' మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, గత ఏడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడడంతో ఆ తర్వాత టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసేశారు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకుంది. కానీ, మరోసారి కరోనా మహమ్మారి విజృంభించడంతో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు దర్శక నిర్మాతలు. దీంతో చైతూ, సాయి పల్లవి ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.

నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' మూవీని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో అది కూడా సాధ్యం కాలేదు. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీని మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక, ఎన్నో ఆటంకాల తర్వాత ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసేసింది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లవ్ స్టోరీ' మూవీ థియేట్రికల్ ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతోన్న రేవంత్, మౌనిక కథతో ఈ సినిమా సాగబోతున్నట్లు చూపించారు. భవిష్యత్ కోసం హైదరాబాద్ చేరుకున్న వీళ్లిద్దరూ డ్యాన్స్ కోసం కలవడం.. ఆ తర్వాత ప్రేమలో పడడం.. ఎప్పటి లాగే వీళ్ల బంధాన్ని పెద్దలు అంగీకరించడకపోవడం వంటివి ఇందులో చూపించారు. ఆరంభంలో ఈ ట్రైలర్ వినోదభరితంగా సాగగా.. ఎమోషనల్‌గా ఎండ్ అయింది. ఇందులో చైతూ.. సాయి పల్లవి తెలంగాన యాసతో మెప్పించారు. మరీ ముఖ్యంగా 'ప్రేమిస్తే చంపేస్తరా అన్నవు కదా.. చంపేస్తరు', 'బతుకు కోసం ఈ ఉరుకులాట నాతోని కాదింకా.. చస్తే చద్దా గది తేల్చుకుని చద్దాం' అనే డైలాగులు ఆకట్టుకున్నాయి.
గ్రామీణ ప్రేమకథతో తెరకెక్కిన 'లవ్ స్టోరీ'లో అక్కినేని నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడి దగ్గర డ్యాన్స్ నేర్చుకునే అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తుందట. ఇది విషాదాంతమైన ప్రేమకథతో తెరకెక్కినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











