‘300 స్క్రీన్లు మల్టీప్లెక్స్ ఓనర్.. సింగిల్ థియేటర్లను దెబ్బ కొడుతున్నాడు’
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. సింగిల్ థియేటర్ల నిర్వహణ కష్టంగా ఉంది. రెంట్ ప్రతిపాదికన వాటిని నడపడం కష్టంగా ఉంది. కాబట్టి పర్సంటేజీ సిస్టమ్‌లో ఎగ్జిబిటర్లకు ఖర్చులను చెల్లించాలని డిమాండ్ చేయడం తెలిసిందే. మంగళవారం డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిర్వహించిన ప్రెస్ మీట్‌కు కౌంటర్‌గా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ టీమ్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.
ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయి. తాము కూడా ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించడం మా దృష్టికి వచ్చింది. ఎగ్జిబిటర్లు ఏక పక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి బెదిరించినట్టుగా మాట్లాడటం సరికాదు. అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి అని తెలుగు నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం కావాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్ గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ఓ ఎకో సిస్టమ్ ఉంది. ఒకరు బాగా లేకపోయినా ముగ్గురు బాగుండరు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ పరిస్థితి బాగాలేదు. ఇండస్ట్రీలో కొన్ని నెలల నుంచి అనిశ్చితి కొనసాగుతున్నది. కంటెంట్ లేక శ్రీరాములు లాంటి థియేటర్ ను మూసేయాల్సి వచ్చిందని వాళ్ళే చెప్పారు. ఎగ్జిబిటర్లు ఇలాంటి షరతులు పెట్టడం వల్ల నిర్మాతల నుంచి ఇంకా కంటెంట్ తగ్గిపోతుంది తప్ప, దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇలా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొని, ఫలానా తేదీ చివరి రోజు అంటూ బెదిరించినట్టుగా మాట్లాడకండి అని అన్నారు.
తెలుగు ఇండస్ట్రీలో 50 శాతానికి పైగా షూటింగ్ అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. వీటిలో చిన్న, పెద్ద అన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే 70-80 శాతం బడ్జెట్ ఖర్చు పెట్టి ఉన్నాం. ఇలాంటి సమయంలో కొత్త విధానం తీసుకొస్తామంటే అది సబబుగా ఉండదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో ఆ విధానాన్ని అంగీకరించలేం. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో ఈ విధానంపై ఆలోచిస్తాం. కానీ, దానికి కొన్ని షరతులు ఉన్నాయి. థియేటర్ల గ్రేడింగ్, మెయింటనెన్స్ ఛార్జ్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కన్వినెన్స్ ఛార్జ్ వంటి విషయాలపై చర్చించిన తర్వాత.. కొత్తగా నిర్మించబోయే సినిమాల విషయంలో పర్సెంటేజ్ విధానానికి వెళ్ళడంలో మాకు అభ్యంతరం లేదు అని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎగ్జిబిటర్, ఆయనకు 300 స్క్రీన్ల ఉన్న మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. ఎన్నో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆదాయానికి గండి కొడుతున్న అలాంటి ఆయన.. నిన్న ప్రెస్ మీట్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించింది. ఇతర రాష్ట్రాల్లో పర్సెంటేజ్ విధానం అమల్లో ఉంది అంటున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ఎవరి పరిస్థితి బాలేదు. వాళ్ళకంటే మనమే మెరుగైన స్థితిలో ఉన్నాము. అలాంటిది మనం వెనక్కి వెళ్లడం ఎందుకు?. ఎగ్జిబిటర్ ఎంత ముఖ్యమో, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యం కదా. అలాంటిది డిస్ట్రిబ్యూటర్ ను చంపేసి, ఎగ్జిబిటర్ ను కాపాడాలి అనడం ఎంతవరకు కరెక్ట్?. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెరుగైన వసతులు కల్పిస్తే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది అని ఘాటుగా స్పందించారు.
అయితే రాంచరణ్ నటించిన పెద్ది సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య గొడవ ఇండస్ట్రీలో గందరగోళానికి కారణమైంది. పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెల పోతున్న సమయంలో ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో అనే విషయంపై భారీ చర్చ జరుగుతున్నది. ఈ వివాదానికి చెక్ చెప్పే విధంగా చర్యలు తీసుకొంటారా? లేక పట్టింపులకు పోయి సినిమా ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెడుతారా? అనే విషయం ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగా మారిందనే టాక్ వినిపిస్తున్నది. 300 స్క్రీన్లు ఉన్న ఓనర్ అంటూ ఏషియన్ సునీల్ గురించి నాగవంశీ చేసిన కామెంట్స్‌కు ఆ వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications