Naga Vamsi Vs Asian Sunil: నాగవంశీ వర్సెస్ ఏషియన్ సునీల్.. నోటి దురుసుతో మాటల యుద్దం
తెలుగు సినిమా పరిశ్రమలో పర్సంటేజీ సిస్టమ్ అంశంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య మాటల యుద్దం జోరందుకొన్నది. రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం వ్యక్తిగతంగా మారిందా? అనే విధంగా ఇండస్ట్రీలో ఓ చర్చ జరుగుతున్నది. పర్సంటేజీ విధానం అమలు చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్బంగా తమ బాధలను, సింగిల్ థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారు నిర్మాతలు, మీడియా దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎగ్జిబిటర్ల సమావేశానికి కౌంటర్ ఇచ్చేందుకు యాక్టివ్ ప్రొడ్యూసర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం రసాభాసగా మారింది. ఈ ప్రెస్ మీట్ నిర్మాతలు నాగవంశీ, ఏషియన్ సునీల్ ఇగోలను రెచ్చగొట్టేలా చేసింది. వారి మధ్య నెలకొన్న వివాదం గురించిన వివరాల్లోకి వెళితే..

సింగిల్ థియేటర్ల ఎదుర్కొంటున్న పరిస్థితిపై ఎగ్జిబిటర్లు ఇచ్చిన వివరణపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ.. ఓ పెద్ద ఎగ్జిబిటర్.. కనీసం 300 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్న పెద్ద ఎగ్జిబిటర్.. ఆయన సింగిల్ స్క్రీన్ల బాధల గురించి చెప్పడం ఓ రకంగా ఉంది. వినడానికి నవ్వు వచ్చింది. సీ సెంటర్ నుంచి ఏ సెంటర్ వరకు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి.. సింగిల్ స్క్రీన్‌కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్నాడు. అలాంటి ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. అట్లాంటి కామెడీ చేయడానికి ప్రెస్‌మీట్ పెట్టకండి అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.
నాగవంశీ చేసిన కామెంట్స్, సెటైర్లపై నిర్మాత, డిస్టిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ ఏషియన్ సునీల్ ఘాటుగా స్పందించాడు. ఆయన టీవీ9 మీడియాతో మాట్లాడుతూ.. పక్కనే ఉన్న వ్యక్తితో సంభాషిస్తూ.. నాపై కామెంట్ చేసిన ఆయన పేరు ఏమిటి? కళ్లద్దాలు, డూప్లికేట్ హెయిర్ (విగ్గు) పెట్టుకొని ఉంటాడే.. అదే పాము.. సారీ.. అంటుంటే.. పక్కనే ఉన్న వ్యక్తి నాగవంశీ అంటూ పేరు చెప్పగా నాగవంశీ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు.
నాగవంశీ ఏదో అన్నాడు... నేను ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మల్టీప్లెక్స్ కడుతానని అన్నాడు. ఎక్కడ కనిపిస్తే అక్కడ కట్టేస్తానా? నా వద్ద స్థలం ఉంది. ఆయనకు చూపెట్టండి. నాకు 33 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. ఇంకో 5 థియేటర్లు కడుతున్నాం. ఇంకా సింగిల్ థియేటర్లు 15కుపైగా బుక్ చేస్తున్నాం. మల్టీప్లెక్సులే బాగున్నాయా? అవేం బాగా లేవు. ఏదో బ్రేక్ ఈవెన్‌కు వస్తున్నాయి. కొంత పర్సంటేజ్ ఇస్తే సింగిల్ థియేటర్లు బతుకుతాయి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అని సునీల్ ఘాటుగా కామెంట్స్ చేశారు.
అయితే ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న సమావేశాలు ఇలా వ్యక్తిగత దూషణలకు కేంద్రంగా మారడంపై నెటిజన్లు, సినీ వర్గాలు, సినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తులగా చలామణి అవుతున్న ప్రముఖులు ఇలా మీడియా ముందు నోటి దురుసును బయటపెట్టుకోవడం భావ్యం కాదు అని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications