నేనే కూల్చేసేవాడిని.. తొందరపడ్డారు , ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగ్ రియాక్షన్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా టీమ్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్‌ను కూల్చివేసి పనులను అధికారులు చేపట్టారు. ఈ పరిణామం తెలుగు సినీ , రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. తుమ్మిడి చెరువులోని దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి నాగార్జున ఈ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
కబ్జాలు, అక్రమ నిర్మాణాలతో పాటు విపత్కర పరిస్ధితుల్లో ప్రజలకు అండగా ఉండేందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని తీసుకొచ్చారు. ఈ క్రమంల్నే అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఓ ఫిర్యాదు అందింది. దీనిని పరిశీలించిన మంత్రి .. తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు సూచించారు. కాగా.. తుమ్మిడికుంట ప్రాంతంలోని ఓ చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినట్లుగా అప్పట్లోనే బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

దానిని కూల్చివేయాలని గత ప్రభుత్వ హయాంలోనే ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. అయితే నాగార్జునకు పెద్దలతో ఉన్న పరిచయాలు , పలుకుబడితో కూల్చివేత ఆగిపోయిందని చర్చించుకుంటూ ఉంటారు. తుమ్మడి కుంటల చెరువులోని 2 ఎకరాలు బఫర్ జోన్‌లో ఉంది. మరో 1.1 ఎకరాలు చెరువు శిఖం కిందకి వస్తుంది. చెరువు కబ్జా కాకుండా 2 ఎకరాలను బఫర్ జోన్‌లో పెడతారు. కానీ నాగ్ ఆ ఏరియాను కూడా ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం .. హైడ్రా ఏర్పాటుతో అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తోంది.
ఈ నేపథ్యంలో నాగార్జున స్పందిస్తూ.. ఎక్స్‌లో సుధీర్ఘంగా ట్వీట్ చేశారు. '' స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను ''.
'' ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని ''.
'' తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను '' అంటూ నాగ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











