Nagarjuna: టాలీవుడ్‌లో కలకలం.. హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున.. అసలేం జరిగిందంటే..?
Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరుపదుల వయసు దాటిన టాలీవుడ్ లో మన్మథుడిగా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు కింగ్ నాగార్జున. కేవలం నటనతోనే కాకుండా ఫిట్ నెస్ విషయంలో కూడా యంగ్ హీరోలతో పోటీపడుతున్నారు. ఈ మధ్యకాలంలో అక్కినేని హీరో తరుచు కోర్టు మెట్లెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ సారి ఏకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇంతకీ ఏం జరిగింది?
పేరు-ఫోటోలు దుర్వినియోగం
హీరో అక్కినేని నాగార్జున తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, వాటిపై తక్షణమే నిషేధం విధించాలని కోర్టును కోరారు. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీ సాయంతో సెలబ్రిటీల ఫేక్ వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలా స్టార్ హీరోల ప్రతిష్ట దెబ్బతింటోందని, అభిమానులు తప్పుదోవ పట్టే పరిస్థితి ఏర్పడుతోందని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కోర్టుకెక్కిన నాగార్జున
నాగార్జున తరపు న్యాయవాది కోర్టులో చేసిన వాదన ప్రకారం.. యూట్యూబ్ షార్ట్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్‌లో AI ఆధారిత మార్ఫింగ్ వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఆయన పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి, కంటెంట్ ద్వారా వ్యాపార లాభాలు పొందుతున్నారు. కొన్ని వెబ్‌సైట్లు ఆయన ఫోటోలు, వీడియోలు ఉపయోగించి టీ-షర్టులు, మెర్చండైజ్ విక్రయిస్తున్నాయి. అంతేకాకుండా, నాగార్జున పేరుతో అశ్లీల లింకులు, కంటెంట్ సృష్టించారని కూడా కోర్టుకు వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత భద్రత, గోపత్య కాపాడేలా వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
14 వెబ్‌సైట్లపై చర్యలు
హీరో నాగార్జున పిటిషన్‌లో పేర్కొన్నట్టుగా తన పేరుతో ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్‌సైట్లు ఆ లింకులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారించింది. నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు కూడా దీనిపై బాధ్యత వహించాలని సూచించింది.
బాలీవుడ్ సెలెబ్రెటీలు
గతంలో ఏఐ ఫేక్ వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేస్తున్నారనే సమస్యతో బాలీవుడ్ ప్రముఖులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ తదితరులు కోర్టు మెట్లెక్కారు. దీంతో వారి పేర్లు, ఫోటోలు, వాయిస్ ను అనుమతి లేకుండా వాడకూడదని కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అదే మార్గంలో నాగార్జున కూడా న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ పరిణామంపై అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. "మన హీరో ఇమేజ్‌తో ఆటలాడే వారికి కఠిన శిక్షలు తప్పవు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications










