Naa Saami Ranga Teaser: మళ్లీ కత్తి పట్టిన నాగార్జున.. నా సామిరంగ హిట్టు కళ కనిపిస్తుందిగా!
చాలా కాలం పాటు వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టినా.. ఈ మధ్యన మాత్రం సరైన భారీ విజయాన్ని అందుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. అందుకే కొంత కాలంగా ఈ సీనియర్ హీరో కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'నా సామిరంగ' చేస్తున్నాడు.
హిట్ ఆకలితో ఉన్న అక్కినేని నాగార్జున ఇప్పుడు 'నా సామిరంగ' అనే సినిమాలో నటిస్తోన్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా చేస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆరంభంలోనే భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

క్రేజీ కాంబోలో రాబోతున్న 'నా సామిరంగ' మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను జరుపుతున్నారు. ఎలాగైనా వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలను కూడా విడుదల చేస్తోంది.
అక్కినేని నాగార్జున - విజయ్ బిన్ని కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'నా సామిరంగ' మూవీకి సంబంధించి ఇటీవలే రెండు గ్లింప్స్ వీడియోలను వదిలారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున పల్లెటూరి ఊరమాస్ లుక్‌తో కనిపించాడు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కత్తి పట్టుకుని శత్రువులను ఊచకోత కోస్తూ మెప్పించాడు.
'నా సామిరంగ' టీజర్ వీడియోలో హీరో గురించి హీరోయిన్ అడగడం.. దీనికి అల్లరి నరేష్ తనదైన రీతిలో ఎలివేషన్స్ ఇస్తూ వివరించడం చూపించారు. ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. మొత్తంగా ఈ టీజర్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తోంది. ఇది చూసిన వాళ్లంతా సినిమాకు హిట్టు కళ కనిపిస్తుంది అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. 'నా సామిరంగ' మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











