నాగార్జున సంచలన నిర్ణయం.. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో ట్విస్ట్
Nagarjuna: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వర్సెస్ మంత్రి కొండా సురేఖ పరువు నష్టం దావాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ మంగళవారం అర్ధరాత్రి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పడంతో, ఈ హైప్రొఫైల్ కేసులో కొత్త మలుపు తిరిగింది. నాగార్జున కుటుంబంపై తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, వాటి వల్ల ఎవరైనా బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె స్పష్టంగా ప్రకటించారు. ఈ పరిణామంతో కోర్టు విచారణకు ముందు రోజు మొత్తం రాజకీయ, సినీ వర్గాల్లో ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరుణంలో హీరో అక్కినేని నాగార్జున ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
వివాదం ఎలా మొదలైంది?
2024 అక్టోబర్ 2న లంగర్‌హౌస్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో, మంత్రి సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేస్తూ అనుకోకుండా అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. "చైతూ-సమంత విడాకులకు కేటీఆర్ కారణం" అని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కామెంట్లు అక్కినేని కుటుంబాన్ని కించపరిచేలా ఉన్నాయని భావించిన నాగార్జున, చట్టపరమైన చర్యలకు దిగారు.

ఈ కేసులో భాగంగా, నాగార్జున సోషల్ మీడియా లింకులు, వీడియో క్లిప్పింగ్స్ వంటి ఆధారాలతో నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబ పరువు, ప్రతిష్ఠకు నష్టం కలిగించాయని, BNS సెక్షన్ 356 కింద క్రిమినల్ డిఫమేషన్ ( పరువు నష్టం దావా) కేసు నమోదు చేయాలని అభ్యర్థించారు.
కోర్టు విచారణ - మధ్యంతర ఉత్తర్వులు
ఈ కేసుపై విచారణ మొదలయ్యాక, నాంపల్లి కోర్టు ముఖ్యమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున కుటుంబంపై ఎవరూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరాదని, రాజకీయ నాయకులు సహా ఎవరూ పబ్లిక్‌గా మాట్లాడరాదని , కోర్టు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. సురేఖకు నోటీసులు జారీ చేయడం, విచారణ తేదీని నిర్ణయించడం, నాగార్జున నుంచి స్టేట్‌మెంట్ నమోదు చేయడం వంటి కీలక చర్యలు కోర్టు చేపట్టింది.
మరోసారి క్షమాపణ.. వ్యూహాత్మక చర్య?
సురేఖ ఇప్పటికే రెండు సార్లు సోషల్ మీడియాలో క్షమాపణలు తెలిపారు. అయితే విచారణకు ఒక్కరోజు ముందు మళ్లీ అర్ధరాత్రి క్షమాపణ చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. "నాగార్జున గారు, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. వారి పరువుకు భంగం కలిగించాలన్న ఉద్దేశం అసలే లేదు. నా వ్యాఖ్యల వలన ఎవరైనా మనస్థాపానికి గురైతే చింతిస్తున్నాను. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను." అంటూ అర్థ రాత్రి వేళ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవడంతో, ఇది కేవలం నిజమైన పశ్చాత్తాపమేనా? లేక రేపటి విచారణకు ముందు న్యాయపరంగా వ్యూహాత్మక అడుగా? అనే ప్రశ్నలు చర్చకు దారి తీశాయి.
నాగార్జున రియాక్షన్
మంత్రి కొండా సురేఖ క్షమాపణలను గౌరవంగా స్వీకరించిన నాగార్జున, కోర్టుకు తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలుపుతూ సమాచారం పంపించారు. దీంతో ఈ పరువు నష్టం కేసు అధికారికంగా ముగిసింది. కొండా సురేఖ - అక్కినేని కుటుంబాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతకు శాంతియుత ముగింపు లభించింది. ఈ మొత్తం వ్యవహారంపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు సురేఖ క్షమాపణలను సానుకూల నిర్ణయంగా చూస్తుండగా.. మరికొందరు కోర్టు విచారణను దృష్టిలో ఉంచుకొని ఇది రాజకీయ ఎత్తుగడ అని అంటున్నారు. ఏది ఏమైనా, ఈ కేసులో క్షమాపణ-విత్‌డ్రా పరిణామం ఈ వివాదానికి ముగింపు పలికినా, రాజకీయ వ్యాఖ్యల్లో వ్యక్తిగత విషయాలను ప్రస్తావించే అలవాటుపై మరోసారి విమర్శలు వెలువడుతున్నాయి. చివరకు ఇరువైపుల శాంతియుత నిర్ణయాలతో వివాదానికి తెరపడింది.


Click it and Unblock the Notifications











