బాలకృష్ణ.. నీ రేంజ్ ఏంటీ? అలాంటి యాడ్‌లోనా? ఏకిపారేస్తోన్న నెటిజన్లు
తమ ప్రొడక్ట్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కంపెనీలు భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. డిస్కౌంట్లు, ఆఫర్లతో వల వేయడంతో పాటు రకరకాల మార్గాల్లో ప్రజలను ఆకర్షించేందుకు వల విసురుతుంటాయి. సినీ స్టార్స్, క్రీడాకారులు, ఇతర సెలబ్రెటీలతో తమ ఉత్పత్తులను అండార్స్ చేయిస్తూ ఉంటాయి కంపెనీలు. అయితే నటీనటులు కొన్ని వివాదాస్పద ప్రకటనల్లో నటించి చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో నటించి ఈడీ నోటీసులు అందుకున్నాడు. తాజాగా మరో తెలుగు అగ్రనటుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆయనెవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఈ వివరాల్లోకి వెళితే..
ఎన్టీఆర్ నటవారసుడిగా ఎంట్రీ
తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య గతేడాదితో నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టడంతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఛైర్మన్‌గా ప్రజాసేవ చేస్తున్నారు. నటుడిగా వరుస విజయాలతో కెరీర్‌లోనే పీక్స్‌లో ఉన్నారు బాలకృష్ణ. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పద్మభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం బాలయ్యను సత్కరించింది. ఇలా బాలకృష్ణ ఏది పట్టుకున్నా బంగారంగా మారుతోంది.

ఖాళీ లేని బాలయ్య డైరీ
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు బాలయ్య. దసరా లేదా దీపావళి నటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలకృష్ణ భావిస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు. అలాగే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్‌ల జైలర్ 2లోనూ బాలయ్య గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య వాణిజ్య ప్రకటనల్లోనూ నటించి అభిమానులను అలరిస్తున్నారు. తన కెరీర్‌లో ఎప్పడూ బ్రాండ్ ప్రమోషన్స్ జోలికి ఆయన వెళ్లలేదు. కానీ 60 ప్లస్‌లో ఆయన ప్రమోటర్‌గా మారారు.
ఆ యాడ్‌తో బాలయ్యపై వివాదం
సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్, వేగ జ్యూయెలర్స్ వంటి సంస్థలకు బాలయ్య అండార్స్‌మెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన యాడ్ ఒకటి వివాదాస్పదమైంది. బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ ఏంటంటే చిన్నపిల్లలను అడిగినా చెబుతారు. ఈ బ్రాండ్‌కు తెలుగు రాష్ట్రాల్లో అనధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలయ్య.. ఇప్పుడు దానికి అఫీషియల్ ప్రచాకకర్తగా మారారు. ఈ మేరకు ఆ సంస్థ కోసం వాణిజ్య ప్రకటనలో నటించారు బాలయ్య. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు బాలయ్యపై మండిపడుతున్నారు.
అలాంటి యాడ్స్ వద్దంటున్న జనం
తమ వల్ల ప్రజల జీవితాలు పాడవ్వడం ఇష్టం లేక సచిన్, అమితాబ్ వంటి వారు ఈ తరహా ప్రకటనల్లో నటించేది లేదని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామన్నా రిజెక్ట్ చేశారు. అలాంటిది ఓ సెలబ్రెటీగా, ఓ ప్రజా ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణ ఎందుకు అంగీకరించారని మండిపడుతున్నారు. అన్నింటికి మించి కొద్దిరోజుల క్రితమే భారతదేశంలోనే మూడో అత్యున్నత అవార్డ్ పద్మభూషణ్‌ను బాలయ్య అందుకున్నారు. హిందూపురం ప్రజలు తమ ఎమ్మెల్యేకి సన్మానం కూడా చేశారు. పేరు ముందు అంతటి విశిష్ట గౌరం దక్కిన తర్వాత బాధ్యతగా మెలగాల్సిన వ్యక్తి ఇలా డబ్బు కోసం దిగజారిపోవద్దంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వివాదంపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











