BB4: గ్రాండ్‌గా అఖండ 2.. డబుల్ హ్యాట్రిక్ కోసం బాలయ్య, బోయపాటి!
హీరోగా బాలకృష్ణ కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడిపోయింది అనుకున్న టైంలో ఆయన అభిమానులు తిరిగి కాలర్ ఎగరేసేలా చేశారు బోయపాటి శ్రీను. మాస్ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరున్న బోయపాటితో బాలయ్య కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో అంచనాలు తారాస్థాయికి చేరాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా తిరుగులేని విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత వరుసగా లెజెండ్, అఖండ చిత్రాలతో ఘన విజయంతో హ్యాట్రిక్ కొట్టింది బాలయ్య - బోయపాటి కాంబో. తాజాగా మరోసారి ఈ జోడీ జతకట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలకృష్ణ- బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. తనకు బాగా అచ్చొచ్చిన డ్యూయెల్ రోల్ ఫార్ములాను ఈ సినిమాలోనూ వాడి హిట్ కొట్టారు బోయపాటి. ఇందులో అఘోరాగా, మురళీకృష్ణగా ఇరగదీశారు బాలకృష్ణ. ముఖ్యంగా అఖండగా ఆయన నట విశ్వరూపం చూపించారు. దీనికి థమన్ అందించిన బీజీఎంతో బాక్స్‌లు బద్ధలయ్యాయి. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న అఖండ.. లాంగ్ రన్‌లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచిపెట్టి బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో అఖండను నిర్మించారు. ఇందులో ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్ విలన్ రోల్ పోషించారు. జగపతి బాబు, నితిన్ మెహతా, పూర్ణ, అవినాష్, సుబ్బరాజు, ప్రభాకర్, చమ్మక్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు. కరోనా తగ్గుముఖం పడుతున్న దశలో ప్రేక్షకుల్ని తిరిగి సినిమా థియేటర్లకు రప్పించింది అఖండ. బాలయ్య చూపిన బాటలో సీతారామం, బింబిసార వంటి సినిమాలు థియేటర్‌లో అడుగుపెట్టాయి.
ఈ నేపథ్యంలో అఖండకు సీక్వెల్ తీయాలని అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వారి ఆశలు ఫలించాయి. అఖండ 2ను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ అక్టోబర్ 16న అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.. టైటిల్ కింద తాండవం అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. తొలి భాగం ఎండ్ అయిన దగ్గరి నుంచి ఈ సెకండ్ పార్ట్ మొదలవుతుందని టాలీవుడ్ టాక్. బాలయ్య కుమార్తె పెద్దయిన తర్వాత ఏం జరిగింది.. మరోసారి అఖండ ఆమెను ఎలా కాపాడాడు అన్నదే సెకండ్ పార్ట్ స్టోరీ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాతే అఖండ 2 సెట్స్‌పైకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. అటు రామ్ పోతినేనితో తీసిన స్కంద డిజాస్టర్ కావడంతో మరోసారి బాలయ్యనే నమ్ముకున్నారు బోయపాటి. ఈ సినిమాతో హిట్ కొట్టి రేసులో నిలబడాలని ఆయన భావిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపీ అచంట, రామ్ అచంట సంయుక్తగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











