Nandamuri Balakrishna హిందూపూర్ విజయంపై బాలయ్య డోంట్ కేర్.. NBK109 షూటింగ్ లోకేషన్‌లోకి ఎప్పుడంటే?
దశాబ్ధాలుగా తెలుగు సినిమాను నాలుగు స్తంభాలుగా మోస్తున్నారు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు నేటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు. వెంకీ, నాగ్‌లు కాస్త స్లో అయినా చిరు, బాలయ్య మాత్రం జోరు చూపిస్తున్నారు. మళ్లీ వీరిద్దరిలోకి నటసింహం సూపర్ ఫాంలో ఉన్నారు. హిట్టు ,ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
గడిచిన కొన్నేళ్లుగా బాలయ్య మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో చేసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాలకృష్ణ బాగా దగ్గరయ్యారు. దానితో పాటే మార్కెట్ కూడా పెరిగింది. యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయి. అఖండ , వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు కోట్లలో కలెక్షన్లు సాధించి లాభాలను తెచ్చిపెట్టాయి. తద్వారా సీనియర్ హీరోల్లో వరుసగా మూడు సినిమాలు ఓవర్సీస్‌లో వన్ మిలియన్ అందుకున్నది బాలయ్య మాత్రమే.

బాలయ్య ప్రస్తుతం తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు బాబీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన #NBK109 గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
అలాగే '' సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్.. హంటింగ్ అంటూ బాలయ్య '' చెప్పే డైలాగ్ పూనకాలు తెస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ హీరో బాబీడియోల్ విలన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. బాలయ్య సరసన ఊర్వశి రౌటేలా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు ఎన్నికలు బ్రేక్ వేశాయి. హీరో బాలయ్య స్వయంగా తెలుగుదేశం పార్టీ అగ్రనేతల్లో ఒకరు , పైగా హిందూపురం శాసనసభ్యుడు. దీంతో ఆయన కూడా అనివార్యంగా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగాల్సి వచ్చింది. తన కుటుంబానికి కంచుకోట వంటి హిందూపురం నుంచి ఇప్పటికే రెండు సార్లు గెలిచిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు.

నామినేషన్ దాఖలు చేసి స్థానిక వ్యవహారాలను చూసుకోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్ధుల తరపున ముమ్మరంగా ప్రచారం చేశారు. తన పదునైన పంచ్ డైలాగ్స్‌తో అధికార వైసీపీపై విమర్శలు చేసిన బాలయ్య.. కూటమి అధికారం వస్తే ఏమేం చేస్తామో వివరించారు. ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య.. అనంతరం పోలింగ్ రోజున సతీసమేతంగా హిందూపురంలో ఓటేశారు. రెండు నెలలకు పైగా ఏపీలోనే గడిపిన బాలయ్య.. పోలింగ్ ముగియడంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
అంతేకాదు.. వచ్చి రావడంతోనే రెస్ట్ లేకుండా తిరిగి షూటింగ్‌లకు హాజరవ్వడం సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం. #NBK109 లేటెస్ట్ షెడ్యూల్‌కి బాలకృష్ణ హాజరవుతారని సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీ ఇప్పటికే రెండు లాంగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. డైరెక్టర్ బాబీ ఈ నెలలో మరో 15 రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో బాలయ్య సెట్‌ని కలుస్తారని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











