నందమూరి కుటుంబంలో విషాదం.. బాలకృష్ణ సోదరుడి సతీమణి కన్నుమూత
తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు అయిన నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకొన్నది. స్వర్గీయ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజా మంగళవారం (ఆగస్టు 19వ తేదీన) తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో నందమూరి కుటుంబంతోపాటు సినీ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురి అయ్యాయి. సతీ వియోగంతో బాధపడుతున్న జయకృష్ణకు సినీ వర్గాలు, పలువురు రాజకీయ నేతలు, స్నేహితులు, సన్నిహితులు సంతాపం తెలిపారు. నందమూరి ఫ్యామిలీ చోటు చేసుకొన్న విషాదం గురించిన వివరాల్లోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ సోదరుడు జయకృష్ణ సతీమణి పద్మజ వయసు 73 సంవత్సరాలు. ఆమె స్వయానా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. పురందేశ్వరి, భువనేశ్వరికి వదిన గారు. గత కొద్దికాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఉదయం కన్నుమూశారు. హస్పిటల్‌కు రాకముందే ఆమె మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

నందమూరి పద్మజా మరణవార్తతో కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని జయకృష్ణ నివాసానికి చేరుకొన్నారు. మృతివార్త తెలియగానే విజయవాడ నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, ఢిల్లీ నుంచి పురంధేశ్వరి వెంటనే హైదరాబాద్‌కు చేరుకొన్నారు. నందమూరి బాలకృష్ణ, ఆయన సోదరులు సోదరుడికి గృహానికి చేరుకొని ఓదార్చారు. జయకృష్ణ నివాసానికి నారా బ్రహ్మణి, తేజస్విని, ఇతర కుటుంబ సభ్యులు రావడం మీడియాలో కనిపించింది.
జయకృష్ణ సతీమణి పద్మజాకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్నిహితులు, బంధువుల చివరి చూపు కోసం వారి నివాసంలో పార్ధీవ దేహాన్ని ఉంచారు. ఆమె అంత్యక్రియలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలను బాలకృష్ణ, రామకృష్ణ, ఇతర సోదరులు నిర్వహించేందుకు బాధ్యత తీసుకొన్నారు. జయకృష్ణ నివాసానికి వచ్చిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











