బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ రీ రిలీజ్.. ఆరోజే ఫ్యాన్స్‌కు ఊరమాస్ ట్రీట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో పాత హిట్ సినిమాల స్పెషల్ షోలు, రీ రిలీజ్‌లు వంటివి ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు కొందరు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చి.. ఆయా సినిమాలను 4K ప్రింట్లుగా మార్చి థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలోనే చాలా సూపర్ హిట్ మూవీలు మరోసారి రిలీజ్ అయి సినిమా హాళ్లలో సందడి చేశాయి. ఆయా చిత్రాలు రెండోసారి విడుదలైనప్పటికీ భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నటసింహా నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ రాబోతుంది. తాజాగా ఆయన అభిమానులు ఖుషీ అయ్యే ప్రకటన వచ్చేసింది.
వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న సమయంలో నటసింహా నందమూరి బాలకృష్ణకు హిట్ ట్రాక్ ఇవ్వడంతో పాటు అప్పటి వరకూ ఆయన కెరీర్‌లో ఉన్న రికార్డులన్నీంటినీ బద్దలు కొట్టిన చిత్రం 'సింహా'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఈ మూవీ కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో వచ్చి ఏకంగా రూ. 36 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. అలాగే, బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇది రికార్డును సాధించింది. ఇప్పుడీ చిత్రాన్నే రీ రిలీజ్ చేయబోతున్నారు.

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన 'సింహా' చిత్రాన్ని మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అంతేకాదు, ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ మూవీ కొత్త ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. అలాగే, త్వరలోనే టికెట్ బుకింగ్స్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారని అంటున్నారు. దీంతో ఈ సినిమాకు మరోసారి భారీ స్పందన అందించి.. రికార్డులు బద్దలు కొట్టాలని నందమూరి అభిమానులు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటించారు. దీన్ని పరుచూరి కిరీటి, పరుచూరి శివరామ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











