ఎన్టీఆర్‌కు ఘన నివాళి ప్లాన్ చేసిన బాలయ్య: రేపే వీడియో రాబోతుందని ప్రకటన
నందమూరి తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలో తండ్రితో కలిసి ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. ఆ తర్వాత సోలో హీరోగా మారారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా.. ఎన్నో రకాల చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఆరు పదుల వయసులోనూ అదే స్పీడుతో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు బాలయ్య. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు నివాళి ఇచ్చేందుకు ఆయన అదిరిపోయే ప్లాన్ చేశారు.
మే 28న నందమూరి తారక రామారావు జయంతి. దీనిని పురస్కరించుకుని ఈరోజు ఓ చిన్న సర్‌ప్రైజ్ రాబోతుందని నిన్న ఎన్‌బీకే ఫిల్మ్స్ సంస్థ ట్వీట్ చేసింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఆ సంస్థ మరో ట్వీట్ వదిలింది. అందులో 'తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి ఇవ్వాలన్న ఉద్దేశంతో నందమూరి బాలకృష్ణ శ్రీరామ దండకం శ్లోకం మొత్తాన్ని స్వయంగా ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో మే 28 అంటే రేపు ఉదయం 9.45 గంటలకు విడుదల కాబోతుంది. దీని కోసమై ఎన్‌బీకే సంస్థ యూట్యూబ్ ఛానెల్‌ను చూడండి' అంటూ అందులో పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణ గతంలోనూ ఇదే తరహాలో శ్లోకాన్ని ఆలపించారు. అప్పుడు దానికి మంచి స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగాన్ని చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. నటసింహా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఇది షూటింగ్ జరుపుకుంటుండగానే గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఏదైన ఒక అప్‌డేట్ కూడా రేపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











