Daaku Maharaaj Trailer : కింగ్ ఆఫ్ జంగిల్ .. తెరపై బాలయ్య శివతాండవం, పండక్కి పూనకాలే
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపులో ఉన్న బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో డాకు మహారాజ్‌పై భారీ అంచనాలున్నాయి. ఇక వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్‌కు మంచి హిట్ అందించిన కేఎస్ రవీంద్ర ( బాబీ) టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడం మరో ప్రత్యేకత.
సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్యను గతంలో ఎన్నడూ చూడని విధంగా పవర్‌ఫుల్ రోల్‌లో చూపిస్తున్నారట బాబీ. డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణ సరసన సైంధవ్ ఫ్రేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ మరో హీరోయిన్‌గా కనిపించనున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా బాలయ్య గెటప్ కొత్తగా ఉంది. గుర్రం మీద వస్తూ , పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బాలయ్య విశ్వరూపం చూపించాడు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది.
అమెరికాలోని డల్లాస్‌లో నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈవెంట్ జరగ్గా.. హైదరాబాద్‌లో జనవరి 7న, అనంతపురంలో జనవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగనున్నాయి. తాజాగా సినిమాలపై అంచనాలను పెంచే విధంగా డాకు మహారాజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అనగనగా ఓ రాజు ఉండేవాడు అంటూ ఓ చిన్న పిల్ల వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. గుర్రానికి ఓ వ్యక్తిని కట్టి ఎడారిలో లాక్కెళ్తుంటారు. చెడ్డవాళ్లంతా ఆయనను డాకు అనేవారని.. మాకు మాత్రం మహారాజు అని ఆ చిన్నారి చెబుతుంది.
అనుకున్నట్లుగానే బాలయ్యను చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు బాబీ. ప్రగ్యా జైస్వాల్ కేవలం హీరోయిన్‌గానే కాకుండా ఇందులో మరేదో పవర్‌ఫుల్ రోల్ ప్లే చేసినట్లుగా కనిపిస్తోంది. మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌కు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్లుగా ట్రైలర్ చెబుతుంది. ఇక మన యానిమల్ విలన్ బాబీ డియోల్‌కు మరో క్రూరమైన క్యారెక్టర్ పడినట్లుగా కనిపిస్తోంది. కొన్ని సెకన్లే కనిపించినా ఎక్స్‌ప్రెషన్స్‌తో తన ప్రతిభను చాటుకున్నాడు.
బాలయ్య గత చిత్రాల మాదిరిగానే ఇందులో ఓ చిన్నారి చుట్టూ కథ తిరుగుతుందని అనిపిస్తోంది. మొత్తం మీద డాకు మహారాజ్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌కు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్యకు మరో సంక్రాంతి హిట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి డాకు మహారాజ్ విశ్వరూపం చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











