Akhanda 2: తెలంగాణలో అఖండ 2 టికెట్ ధరల పెంపు.. ప్రీమియర్ షో టికెట్ రేట్ ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 మూవీ టికెట్ ధరల పెంపునకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. తమ సినిమాకు టికెట్ ధరలు పెంచాలని, అలాగే ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వాలంటూ అఖండ 2 చిత్ర యూనిట్ చేసుకున్న దరఖాస్తును రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దాంతో తెలంగాణలో అఖండ 2 సినిమా టికెట్ ధరలు పెరుగుతాయా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. అయితే రిలీజ్‌కు కొన్ని గంటల ముందు ఈ సస్పెన్స్‌కు రేవంత్ రెడ్డి సర్కార్ తెరదించింది. ఈ వివరాల్లోకి వెళితే..
పుష్ప 2 సమయంలో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్, ఇటీవలి కాలంలో పలు సినిమాల టికెట్ ధరలపై కొందరు కోర్టులను ఆశ్రయించిన సంఘటనలు తెలిసిందే. టికెట్ ధరల పెంపుపై న్యాయస్థానాలు సైతం మొట్టికాయలు వేయడం తదితర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 టికెట్ ధరల పెంపు నిర్ణయంపై ఆలోచనలో పడింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేసింది. తొలుత అఖండ 2 నిర్మాతలు చేసిన అభ్యర్ధనను పెండింగ్‌లో పెట్టినప్పటికీ చివరికి సానుకూలంగా స్పందించింది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఇచ్చింది.

రాష్ట్రంలో అఖండ 2 మూవీకి టికెట్ ధరలు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 4వ తేదీన జీవో విడుదల చేసింది. అయితే డిసెంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మాత్రమే పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్‌లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు (జీఎస్టీతో కలిపి) పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అలాగే డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షో ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనికి టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెంచిన ధరల ద్వారా వచ్చిన ఆదాయంలో నుంచి 20 శాతం మొత్తాన్ని మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు మళ్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సినీ కార్మికుల సంక్షేమాన్ని ఈ మొత్తాన్ని వినియోగించాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎఫ్‌డీసీ) తెరిచింది. ఈ ఖాతాను రాష్ట్ర లేబర్ కమీషనర్ పర్యవేక్షించనున్నారు. దీనితో పాటు థియేటర్లలో డ్రగ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ అవగాహనా ప్రకటనలు తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం తన జీవోలలో తెలిపింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా... తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కొంత ఆలస్యమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అఖండ 2 టికెట్ ధరలను పెంచుతూ రెండ్రోజుల క్రితమే ఆదేశాలు జారీ అయ్యాయి. దీని ప్రకారం.. సింగిల్ స్క్రీన్‌లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు (జీఎస్టీతో కలిపి) పెంచుకోవచ్చు. రోజుకు ఐదు షోలతో పాటు దాదాపు 10 రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి. అలాగే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షో ప్రదర్శించడానికి కూడా ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రీమియర్ షో ధరను 600గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఖండ 2 టికెట్ ధరలను పెంచినట్లయ్యింది.


Click it and Unblock the Notifications











