నేను ఒరిజినల్ .... వాళ్లంతా గ్రీన్‌మ్యాట్ హీరోలే.. బాలయ్య షాకింగ్ కామెంట్స్
అన్న నందమూరి తారక రామారావు వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ ఇటీవలే 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 65 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా తెలుగు ప్రజలకు సేవ చేస్తున్నారు బాలకృష్ణ. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అయితే బాలయ్య ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
వివాదాల్లో బాలయ్య
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిరంజీవి, వైఎస్ జగన్ గురించి బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తనను చిత్ర పరిశ్రమ పట్టించుకోవడం లేదని, సినీరంగ సమస్యల గురించి ప్రభుత్వం మాట్లాడే సమయంలోనూ తనకు ఆహ్వానం ఇవ్వడం లేదని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బాలయ్య చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి సున్నితంగా కౌంటర్ వేశారు. వైఎస్ జగన్ కూడా తాగినోళ్లని అసెంబ్లీకి ఎందుకు అనుమతించారంటూ ఫైరయ్యారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.

బాలయ్యకు సన్మానం
కాగా.. గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇటీవల ఘనంగా ప్రారంభమైంది. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్‌లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో దేశ విదేశాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొనగా ఆయనను నిర్వాహకులు సత్కరించారు. గోవా గవర్నర్, సీఎంలతో పాటు కేంద్రమంత్రి ఎల్ మురుగన్‌లు బాలయ్యను వేదికపై శాలువాతో సత్కరించారు. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నందుకు గాను బాలయ్యను నిర్వాహకులు సన్మానించారు.
చిత్ర నిర్మాణంపై టెక్నాలజీ డామినేషన్
సన్మానం అనంతరం బాలకృష్ణ ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ చిత్ర పరిశ్రమలో టెక్నాలజీ డామినేషన్ గురించి వ్యాఖ్యానించారు. నేను సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను, కేవలం ఎన్టీఆర్ కొడుకుగానే, అందుకే సినిమాలలో ఇప్పటికీ కొనసాగుతున్నాను. సినిమాపై నాకున్న జ్ఞానం, వారసత్వమే ఇందుకు కారణం. దీనిపై నాకు గర్వంగా ఉంది. కానీ ఈ రోజుల్లో చిత్ర నిర్మాణంపై టెక్నాలజీ ఆధిపత్యం చెలాయిస్తోంది అని బాలయ్య వ్యాఖ్యానించారు.
నేను ఒరిజినల్
తమ పని తాను చేసుకోవడానికి టెక్నాలజీపై ఆధారపడే నటులతో పోలిస్తే నేను ఒరిజినల్. నా సినిమాలు జీవితం కంటే పెద్దవి, నా కథలు నాకు ఎంతో ముఖ్యం. అవసరమైనప్పుడు టెక్నాలజీని ఉపయోగిస్తాం.. కానీ కొందరు మాత్రం గ్రీన్‌మ్యాట్‌లు, బ్లూ మ్యాట్‌లు ఉపయోగిస్తున్నారు. కొందరు హీరోలైతే సెట్‌లలోకి కూడా రారు.. నేను ఒరిజినల్, డూప్లికేట్ కాదు అంటూ బాలకృష్ణ చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బాలయ్యపై హీరోల అభిమానులు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. కాగా.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం అఖండ 2తో ప్రేక్షకులను పలకరించనున్నారు. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











