ఎంత మంచివాడవురా షూటింగ్ పూర్తి.. సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ
పటాస్ చిత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ తన సత్తాను చాటుకున్న హీరో.. మళ్లీ ఆ రేంజ్‌లో హిట్ కొట్టలేకపోతున్నాడు. కొత్త ట్రై చేసిన నా నువ్వే, 118 కూడా విజయాన్ని చేకూర్చలేకపోయాయి. తాజాగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎంత మంచివాడవురా' అంటూ పలకరించేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తాజాగా చిత్రబృందం పేర్కొంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పాటలకు ఎంతో ప్రాధాన్యముండేలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాట, రామజోగయ్య శాస్ర్తి రెండు పాటలు, శ్రీమణి ఒక పాట రాశారు. ఇందులో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయని దర్శకుడు సతీష్ వేగేశ్న తెలిపారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ను ఖర్చుకు వెనుకాడకుండా చాలా రిచ్‌గా తీశామని, గోదావరి నదిలో సాహోసోపేతంగా చిత్రీకరించిన ఈ సన్నివేశాల విషయంలో ఫైట్ మాస్టర్ వెంకట్ రిస్క్ తీసుకున్నారని వివరించారు.

నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ కారక్రమాలు పూర్తయ్యాయని, జనవరి 15న విడుదల చేయనున్నామని చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయన్నారు. 'కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదుచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీజర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఖరి షెడ్యూల్ కేరళలోని మున్నార్ తదితర సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఆడియో రంగంలో మా సంస్థ ఎలా దూసుకుపోయిందో చిత్ర నిర్మాణ రంగంలోనూ ఆ ఒరవడిని కొనసాగిస్తుంది.డిసెంబరు 1 నుంచి రీరికార్డింగ్ ప్రారంభమవుతుంది ' అని వివరించారు. చిత్ర సమర్పకులు శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. 'అన్ని వర్గాల
ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది. చాలా సంతృప్తికరంగా అవుట్ పుట్ వచ్చింది. డిసెంబరులో పాటలను విడుదల చేస్తాం' అని వివరించారు.


Click it and Unblock the Notifications











