ఎన్టీఆర్‌తో పోటీయా? తమ్ముడి టాలెంట్ నెక్ట్స్ లెవల్.. తారకరత్న లాస్ట్ వీడియో వైరల్
నందమూరి వంశం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు నందమూరి తారకరత్న. పలు చిత్రాలతో మెప్పించిన ఆయన తర్వాత ఎందుకో సినిమాలకు దూరమయ్యారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని రాజకీయాల్లో యాక్టీవ్ అవుతుండగా గుండెపోటుకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన దూరమై ఫిబ్రవరి 18తో రెండేళ్లు నిండాయి. తారకరత్న వర్ధంతి సందర్భంగా నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
నందమూరి మోహనకృష్ణ కుమారుడైన తారకరత్న 2002లో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాదు.. హీరోగా ఒకే రోజు తొమ్మిది చిత్రాలను మొదలుపెట్టిన రికార్డ్ ఆయనదే. దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఏ హీరోకు ఇలాంటి రికార్డు లేదు. వాటిలో ఒకటో నెంబర్ కుర్రాడు, తారక్, భద్రాద్రి రాముడు, నో, యువరత్న వంటి సినిమాలు విడుదల కాగా.. కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి.

దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో 21 సినిమాల్లో హీరోగా నటించిన తారకరత్న.. పలు సినిమాల్లో ప్రతినాయకుడిగానూ మెప్పించారు. 2009లో విడుదలైన అమరావతి చిత్రానికి గాను బెస్ట్ విలన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డ్ అందుకున్నారు. 2022లో 9 హావర్స్ అనే వెబ్ సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటించి ఆకట్టుకున్నారు. చివరిగా సారథి అనే సినిమాలో తారకరత్న కనిపించారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆయన కన్నుమూశారు.
సినిమాలలో తన మార్క్ చూపించిన తారకరత్న రాజకీయాలలో రాణించాలని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా పాల్గొనేవారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారకరత్న గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను తొలుత కుప్పం ఆసుపత్రికి అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న 2023 ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున శివైక్యం చెందారు .

అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు పోటీగానే తారకరత్నను నందమూరి కుటుంబం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిందని ఇప్పటికీ ఫిలింనగర్‌లో చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాటికి ఆయన బతికి ఉన్న రోజుల్లోనే చెక్ పెట్టారు. తమ్ముడు ఎన్టీఆర్ 2000-01 ప్రాంతంలోనే సినిమాల్లోకి వచ్చారని, నేను ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికే తమ్ముడు ఆది లాంటి పెద్ద హిట్స్ ఇచ్చారని తారకరత్న చెప్పారు.
ఎన్టీఆర్ మంచి నటుడని, ఆయన స్థాయి వేరని .. కానీ మేమంతా నందమూరి బిడ్డలమని.. మా కుటుంబం పేరు ప్రజల్లో ఇవాళ్టీకి నిలబడటానికి ఎన్టీఆర్ కూడా ఒక కారణమని తెలిపారు. తారక్ సక్సెస్‌ను చూసి అన్నగా ఎంతో సంతోషిస్తానని.. మా మధ్య మంచి అనుబంధం ఉందని, ఎప్పుడూ కలిసినా సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటామని తారకరత్న చెప్పారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ పాత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











