మకాం మార్చేసిన నాని.. ఇకపై ఆ నగరంలోనే!
నాచురల్ స్టార్ నాని మకాం మార్చేశాడు. పొల్లాచ్చి నుంచి రాజమండ్రికి అన్నీ సర్దేశాడు. అర్థం కాలేదా! అదేనండీ.. తన లేటెస్ట్ మూవీ 'టక్ జగదీష్' కోసం నాని పడుతున్న పాట్లివి. ఇన్నిరోజులు తొలి షెడ్యూల్ షూటింగ్‌లో భాగంగా పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో సెట్స్‌పై చురుకుగా కదిలిన ఈ నాచురల్ స్టార్.. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించాడు.
నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ 'టక్ జగదీష్' మూవీ రూపొందుతోంది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

పొల్లాచ్చిలో జరిగిన తొలి షెడ్యూల్‌లో నాని, రీతూ వర్మలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేశామని తెలిపింది చిత్రయూనిట్. ఈ షెడ్యూల్‌లో ఒక పాట, ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తామని తెలిపారు మేకర్స్.
గతంలో ఇదే శివ నిర్వాణ- నాని కాంబినేషన్‌లో వచ్చిన 'నిన్నుకోరి' సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. అదేబాటలో మళ్ళీ రెండో సినిమాతో పలకరించేందుకు రెడీ అయిన ఈ జోడీ ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి మరి!.


Click it and Unblock the Notifications











