Nani: దసరాలో ఆ బూతు పదం.. ఇంట్లో పిల్లలు వాడితే ఎలా? నాని సమాధానం ఏమిటంటే?
అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుకు పెట్టిన నాని అనుకోకుండా హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ఇస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకోవడంతోపాటు పక్కింటి కుర్రాడి వంటి పాత్రలతో నేచురల్ స్టార్ అయ్యాడు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు.
ఇప్పుడు తాజాగా దసరా అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే హిట్ 2 మూవీతో నిర్మాతగా మంచి విజయం సాధించిన నాని.. ఇప్పుడు దసరాతో హీరోగా కూడా సూపర్ హిట్ కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక తాజాగా ఓరి వారి లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు నాని.

డైరెక్టర్ గా పరిచయం చేస్తూ..
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా అంటే సుందరానికి సినిమాతో అలరించగా ఇప్పుడు దసరా మూవీతో రానున్నాడు. 90వ దశకం కాలంలో బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నాని మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ లుక్ లో వెన్నెల అనే పాత్రలో ఆకట్టుకోనుంది. న్యూ టాలెంటెడ్ ను ఎంకరేజ్ చేసే నాని ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదేలను డైరెక్టర్ గా పరిచయం చేశాడు.

రూ. 65 కోట్ల బడ్జెట్ తో దసరా..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించిన దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమాను నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పుకొవచ్చు. రూ. 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దసరా సినిమాకు ప్రిరిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోందని సమాచారం.

ఇప్పటికే రూ. 10 కోట్ల లాభం..
దసరా చిత్రానికి పెట్టిన బడ్జెట్ కంటే థియేట్రికల్ బిజినెస్ ద్వారా వస్తున్న మొత్తం కాస్తా ఎక్కువగానే ఉన్నటలు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి మొత్తాన్ని రకవరీ చేసి సుమారు రూ. 10 కోట్లు లాభాలు పొందారని సమాచారం. ఇదిలా ఉంటే నాని, కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన దసరా మూవీని పాన్ ఇండియా చిత్రంగా మార్చి 30 గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో..
తాజాగా దసరా సినిమా నుంచి 'ఓరి వారి' అనే బ్రేకప్ ఆంథమ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు నాని సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా దసరాకు విడుదల కావట్లేదు కదా. అసలు దసరా అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటని ఒక విలేకరి ప్రశ్నించారు. "దసరా చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. అందరికీ దసరా అంటే తెలుసు. ఇదొక అడ్వాంటేజ్. ప్రతి భాషలో పేరు మార్చాల్సిన అవసరం ఉండదు. ఇంతకంటే యాప్టెడ్ టైటిల్ దొరకదు" అని నాని తెలిపాడు.

ఎవరైన తిట్టడానికి వాడతారా..
అలాగే దసరా మూవీలో నాని 'బాంచత్' పదాన్ని ఉపయోగిచండపై ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ చేశారు. "తెలుగు సినిమా పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత మహిళా అభిమానులు ఎక్కువగా ఉన్న ఏకైక హీరో మీరే అన్నది నో డౌట్. అలాంటి హీరో అయిన మీరు ఈ సినిమాలో బాంచత్ అనే పదాన్ని ఎలా వాడారు" అని ప్రశ్నించారు. దీనికి "బాంచత్ అనే పదాన్ని మాములుగా మిమ్మల్ని ఎవరైన తిట్టడానికి వాడతారా.. పోనీ మీరు ఎవరినైనా అంటారా" అని నాని వివరించే ప్రయత్నం చేశాడు.

మీనింగ్ ఇంకోటి ఉందని..
ఇంకా నాని కొనసాగిస్తూ.. "ఈ మ్యాచ్ గెలుద్దాం రా బాంచత్ అని సవాల్ విసిరే సమయంలో ఇలాంటి పదం ఉపయోగిస్తాం. ఒక ఎమోషన్ ను కన్వే చేసేదే భాష. అలాంటి భాషలో ఈ పదాన్ని తరతరాలుగా తెలంగాణలో ఏ ఎమోషన్ కు అయితే వాడుతున్నారో ఇక్కడ అదే ఎమోషన్ తీసుకుందాం. అంతే తప్పా నార్త్ ప్రజలు ఉపయోగించే ఆ పదానికి ఇంకో వెర్షన్ ఉంది. మీనింగ్ ఇంకోటి ఉందని.. అది తీసుకోవాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

ఇంట్లో పిల్లలు వాడితే..
నాని సమాధానానికి "మన ఇంట్లో పెరిగే పిల్లలు ఇలాంటి పదాలు వాడితే ఇబ్బందిగా ఉంటుంది కదా" అని తిరిగి ప్రశ్నిస్తే.. "రెండు పదాల అర్థాలను అర్థమయ్యే విధంగా పిల్లలకు చెప్పండి. ఆ పదానికి, ఈ పదానికి ఉన్న డిఫరెన్స్ చెప్పండి. ఈ ఎగ్జామ్ నేను పాస్ అయి చూపిస్తా బాంచత్ అని టీచర్ తో అని చూడమని చెప్పండి. తప్పు కాదు" అని నాని వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











