వైజాగ్ మ్యాట్రిమోని సైట్‌లో నాని ప్రొఫైల్.. అర్జున్ సర్కార్ ప్రొఫైల్‌ను లీక్ చేసిన హిట్ డైరెక్టర్
ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నెటిజన్లకు క్రియేటివిటీ బాగా పెరిగిపోతున్నది. ఇక సోషల్ మీడియా చేతిలోకి రాగానే.. అకౌంట్ హోల్డర్ చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక ఓటరు కార్డులో తమకు ఇష్టమైన నటి, నటుడి ఫోటోను పెట్టడం.. అలాగే రేషన్ కార్డులో సినీ నటుల వివరాలు పొందుపర్చడం అప్పుడప్పుడు మన దృష్టికి వస్తుంటాయి. తాజాగా ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో నేచురల్ స్టార్ నాని ఫోటో పెట్టి.. పెళ్లి కోసం సిద్దమైన యువకుడిగా ఆ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడం దర్శకుడు శైలేష్ కొలను కంటపడింది. ఆ వివరాల్లోకి వెళితే...
దర్శకుడు శైలేష్ కొలను, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన హిట్ 3 చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని అర్జున్ సర్కార్ పాత్ర అందర్నీ ఆకట్టుకొన్నది. ఇప్పటి వరకు పక్కింటి కుర్రాడి పాత్రను పోషించిన నాని.. ఈ సినిమాలో వయోలెంట్ యాక్షన్ హీరోగా మాస్ లుక్‌తో మెప్పించాడు. అయితే అబ్ కా బారీ.. అర్జున్ సర్కార్ అంటూ బాక్సాఫీస్‌ను చిత్తు చేశాడు. అయితే ఆ క్యారెక్టర్‌ను, నాని ఫోటోను వధూవరుల పరిచయ వేదికలో పొందుపరచడం ఆసక్తిని రేపింది.

వైజాగ్ మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌లో అ3ర్జున్ సర్కార్ పేరిట అకౌంట్ ఓపెన్ చేశారు. పుట్టిన రోజున జూన్ 17, 1979 సంవత్సంగా నమోదు చేసుకొన్నారు. ఇక అ3ర్జున్ సర్కార్.. మృదు స్వభావి. సున్నితంగా మాట్లాడుతాడు. ఫ్యామిలీ వాల్యూస్ చాలా ఎక్కువ. చాలా కామ్, పరిపూర్ణతతో ఉంటాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అలాగే అసలు ఆరోగ్యకరమైన సమస్యలు లేనే లేవు అంటూ తన గురించి బయోడేటాలో పేర్కొన్నారు. 44 ఏళ్ల వయసులో సరైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను అనే విధంగా తన వివరాలను పొందుపరిచాడు.

హిట్ 3 సినిమాలోని అర్జున్ సర్కార్ ప్రొఫైల్ ఇది. సరైన వధువు కోసం మా హీరో వెతుకుతున్నాడు. నిజాయితీతో కూడిన ఇలాంటి ప్రొఫెల్ నా కంటపడింది. ఆశ్చర్యమేమిటంటే.. ఈ రోజు అర్జున్ సర్కార్ పుట్టిన రోజు. కాబట్టి సర్కార్‌కు నా పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ శైలేష్ కొలను ట్వీట్ చేసి ఈ విషయాన్ని నెటిజన్లకు వెల్లడించారు.
అయితే శైలేష్ కొలను పోస్టు ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నది. ఈ పోస్టుపై నెటిజన్ల రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హిట్ 4 ఫ్రాంచైజీ ఎప్పుడు? నీ నెక్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు? అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టుపై నాని గానీ, ఆయన సతీమణి గానీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీనిధి శెట్టి అర్జున్ సర్కార్ కోసం ప్రయత్నిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











