‘క్రాక్’ మూవీపై నారా లోకేష్ ట్వీట్: అతడికి శుభాకాంక్షలు చెప్పిన మాజీ మంత్రి
టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో గోపీచంద్ మలినేని ఒకడు. సినిమాల మీద ఉన్న మక్కువతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించాడు. మొదట్లో శ్రీహరి నటించిన 'పోలీస్' సినిమాకు పని చేసిన అతడు.. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు, శ్రీను వైట్ల దగ్గర 'అందరివాడు', 'వెంకీ', 'ఢీ' సినిమాలకు వర్క్ చేశాడు. వీటితో పాటు మురుగదాస్ దగ్గర 'స్టాలిన్' సినిమాకు, శ్రీవాస్ దగ్గర 'లక్ష్యం' సినిమాకు, అలాగే మెహర్ రమేష్ దగ్గర 'కంత్రి', 'బిల్లా' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇక, 'డాన్ శీను' ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.
కొంత కాలంగా సరైన హిట్ దొరకక ఇబ్బంది పడుతోన్న గోపీచంద్ మలినేని.. ఈ ఏడాది సంక్రాంతికి రవితేజతో 'క్రాక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో అటు రవితేజ.. ఇటు గోపీచంద్ ఇద్దరూ హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు హ్యాట్రిక్‌ను కూడా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి, దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ఈరోజు గోపీచంద్ మలినేని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వేదికగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో 'గోపీచంద్ మలినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటీవల క్రాక్ మూవీ చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఇలాగే మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, గోపీచంద్ మలినేని తన తర్వాతి ప్రాజెక్టును నందమూరి బాలకృష్ణతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు కూడా.


Click it and Unblock the Notifications











