‘రిపబ్లిక్’ మూవీపై నారా లోకేష్ షాకింగ్ రియాక్షన్: సాయి ధరమ్ తేజ్ కోసం స్పెషల్ ట్వీట్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరణను అందుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, మధ్యలో పరాజయాల పరంపరతో తెగ ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు సాయి తేజ్. అప్పటి నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్.. విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు దేవ కట్టాతో 'రిపబ్లిక్' అనే సినిమాను చేశాడు. పూర్తి స్థాయి పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రిలో చికిత్సను తీసుకుంటున్నా.. చిత్ర యూనిట్ ఈ మూవీని విడుదల చేసింది. ఇక, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీకి అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ సొంతం అయింది. ఫలితంగా మూవీ యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

ఎన్నో అంచనాల ఉన్న 'రిపబ్లిక్' మూవీకి దాదాపు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 13.60 కోట్లు మేర వ్యాపారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. చాలా చోట్ల విడుదలవడంతో పాటు టాక్ కూడా బాగుండడంతో ఈ మూవీకి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. మొదటి రోజు దాదాపు మూడు కోట్ల రూపాయల వరకూ వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా కోటిన్నర వరకూ రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని ఈ సినిమాకు రెండు రోజుల్లో రూ. 3.71 కోట్లు షేర్, రూ. 6.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
ఆలోచింప చేసేలా ప్రత్యేకమైన సందేశంతో తెరకెక్కిన 'రిపబ్లిక్' మూవీకి ప్రేక్షకుల నుంచే కాదు.. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. అందులో 'రిపబ్లిక్ మూవీ గురించి కొన్ని మంచి మంచి రివ్యూలు వచ్చాయి. దేవ కట్టా.. సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ అద్భుతమైన సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అంటూ పేర్కొన్నారాయన.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రిపబ్లిక్' మూవీలో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా నటించాడు. ప్రభుత్వంపై పోరాట చేసే పాత్రలో అతడు అద్భుతంగా కనిపించాడు. ఇక, ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేశారు. అలాగే, ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. దీనికి మణి శర్శ సంగీతం సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











