చంద్రబాబు, నారా రోహిత్ కుటుంబంలో విషాదం, పెళ్లి చూడకుండానే తిరిగి రాని లోకాలకు..
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు , హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో రామ్మూర్తి నాయుడు కన్నుమూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులు అధికారికంగా ఆయన మరణవార్తను ధ్రువీకరించాల్సి ఉంది.
సోదరుడి మరణవార్త గురించి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి , మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా ఏఐజీ ఆసుపత్రికి బయల్దేరినట్లుగా తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు మరణంతో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నారా రామ్మూర్తి నాయుడు ప్రస్థానం :
నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడే రామ్మూర్తి నాయుడు. ఈయనకు ఇద్దరు కుమారులు. ఒకరు హీరో నారా రోహిత్, మరో కుమారుడు నారా గిరీష్. రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తితో ఉండే రామ్మూర్తి నాయుడు అన్న చంద్రబాబు బాటలోనే రాజకీయాల్లో ప్రవేశించారు. 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 1999 ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీకి పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్ధి గల్లా అరుణ కుమారి చేతిలో రామ్మూర్తి నాయుడు ఓటమి పాలయ్యారు. తర్వాతి కాలంలో అనారోగ్యానికి గురైన రామ్మూర్తి నాయుడు రాజకీయాలకు దూరమయ్యారు.
రామ్మూర్తి కుమారుడు నారా రోహిత్ నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సోలో సినిమాతో బ్రేక్ అందుకున్న నారా రోహిత్ అనంతరం ఒక్కడినే, రౌడీ ఫెలో, ప్రతినిధి, అసుర, జో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు , వీర భోగ వసంత రాయలు వంటి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో రిలీజైన వీరభోగ వసంతరాయలు తర్వాత నారా రోహిత్ కొత్తగా ఏ సినిమాకు కమిట్ కాలేదు. దాదాపు ఆరేళ్లు ఖాళీగానే ఉన్నారు. ఈ క్రమంలోనే తన హిట్ మూవీ ప్రతినిధికి సీక్వెల్‌గా తెరకెక్కిన ప్రతినిధి 2లో నటించారు.
Ramamurthy Naidu Garu, the brother of CM Chandrababu Naidu and father of Nara Rohit, has passed away. May his soul rest in peace. pic.twitter.com/QLso7RkK9w
— Movies4u (@Movies4uOfficl) November 16, 2024
ఈ ఏడాది రిలీజైన ప్రతినిధి 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో తనతో పాటు నటించిన సిరి లెల్లతో ప్రేమలో పడిన రోహిత్ పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో రోహిత్ - సిరీల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ , భువనేశ్వరి, బ్రాహ్మణి తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇరు కుటుంబాలు పెళ్లికి సిద్ధమవుతుండగా కొడుకు వివాహం చూడకుండానే రామ్మూర్తి నాయుడు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.


Click it and Unblock the Notifications











