చిరంజీవితో నయనతార ఫిక్స్.. లేడీ సూపర్‌స్టార్‌నే ప్రమోషన్స్‌కి లాగిన అనిల్
ఈ ఏడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరిలతో సంక్రాంతి వస్తున్నాం తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దర్శకుడు అనిల్ రావిపూడి. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఓ రీజనల్ సినిమా ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. చిరు కెరీర్‌లో ఇది 157వ సినిమా కావడం విశేషం. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన ఎవరు హీరోయిన్‌గా నటించబోతున్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనికి ఈరోజుతో చెక్ పెట్టేశారు అనిల్ రావిపూడి. ఈ వివరాల్లోకి వెళితే..
హిట్ కొట్టాలని చిరంజీవి
భోళా శంకర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న చిరంజీవి ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దీనిలో భాగంగా అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ ఓకే చేశారు మెగాస్టార్. ఇప్పటికే విశ్వంభరను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న చిరు ఆ వెంటనే శ్రీకాంత్ ఓదెలతో సినిమాకు కమిట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ చిరు మాత్రం అనిల్ రావిపూడితో చేసేందుకే ఓకే చెప్పారు. ఈ సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, సాహూ గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

విభిన్నంగా చిరు 157 ప్రారంభోత్సవం
ఇక ప్రమోషన్స్‌తోనే సినిమాకు హైప్ తీసుకొచ్చే అనిల్ రావిపూడి .. చిరు 157 ప్రారంభోత్సవాన్ని విభిన్నంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాల కటౌట్‌లను లొకేషన్‌లో ఏర్పాటు చేస్తారు. చిరు అలా కారులోంచి దిగి రాగానే మెగా 157 టెక్నీషియన్స్‌ని ఒక్కొక్కొరిని ఇంట్రడ్యూస్ చేశారు. చివరిలో గ్యాంగ్ లీడర్‌ని అంటూ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇస్తారు. నువ్వే ఈ గ్యాంగ్ లీడర్ అని మాకు తెలుసులే కానీ సంక్రాంతికి ఏం ప్లాన్ చేస్తున్నావని చిరు అడుగుతారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అని ఇద్దరూ అంటారు. ఈ వీడియో అప్పట్లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగింది.
హీరోయిన్ ఎవరంటూ ప్రచారం
అంతా బాగానే ఉంది కానీ చిరంజీవి సరసన నటించబోయే ముద్దుగుమ్మ ఎవరు అంటూ బాగా డిస్కషన్ నడించింది. త్రిష, అనుష్క, నయనతార తదితర సీనియర్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో నయనతార పేరు కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. చిరంజీవితో గతంలో సైరా నర్సింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నయన్ నటించారు. అయితే నయనతార ఈ సినిమాలో కన్ఫర్మ్ అయినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఓ వీడియోతో షాకిచ్చారు అనిల్ రావిపూడి. అంతేకాదు.. ఏకంగా నయనతారతో వీడియో చేసి సినీ జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
నయనతారనే ప్రమోషన్స్‌కే ఒప్పించిన అనిల్
కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు నయనతారకు ప్రమోషన్స్‌కి రాదన్న చెడ్డ పేరొచ్చింది. ఎంతటి స్టార్ హీరోతో చేస్తున్నా సరే తాను ప్రమోషన్స్‌కు రానని తేల్చిచెప్పేస్తారు నయన్. అలాంటిది నయనతారతోనే ప్రమోషనల్ వీడియో చేసి శెభాష్ అనిపించుకున్నారు అనిల్. అది కూడా సినిమా ఆరంభానికి ముందే ఆమెతో ప్రమోషన్స్ చేయించడం మామూలు విషయం కాదు. ఇక వీడియో విషయానికి వస్తే.. తెలుగులో సినిమా చేస్తున్నారా? అని నయనతారని ఆమె అసిస్టెంట్స్ అడుగుతారు.
రఫ్పాడిద్దామన్న నయనతార
ఆ తర్వాత కారులో వెళ్తుండగా చిరంజీవి పాట రావడంతో సౌండ్ పెంచమని డ్రైవర్‌తో చెబుతుంది నయనతార. అనంతరం స్క్రిప్ట్ అంతా చదువుతూ నవ్వుకుంటుంది.. తర్వాత కెమెరా కొంచెం టర్నింగ్ ఇచ్చుకో అని నయన్ అనడంతో అనిల్ రావిపూడి ఎంట్రీ ఇస్తాడు. ఆ వెంటనే సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అని ఇద్దరూ కలిసి గ్యాంగ్ లీడర్‌లోని చిరు ఐకానిక్ ఫోజులు పెడతారు. ఈ ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా చూస్తుంటే సంక్రాంతికి గట్టిగానే కొట్టేలా ఉందని చిరు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











