సరికొత్తగా కనిపిస్తోన్న ‘నీతో’
ఓటీటీల ప్రభావంతో తెలుగు సినిమా గమనం పూర్తిగా మారిపోయింది. ఓ వైపు ఓటీటీల కంటెంట్ రాజ్యమేలుతున్నా మంచి కథ ఉండాలే కానీ, థియేటర్ రిలీజ్ లు కూడా గట్టిగానే ఆడేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సీతారామం, కార్తికేయ వంటి హిట్స్ తో మళ్లీ థియేటర్లు కళకళలాడుతుంటడంతో కాంటెంపరెరీ సినిమాలు సైతం రిలీజ్ లకు క్యూకట్టేస్తున్నాయి. ఇక వీటిలో ప్రామిస్సింగ్ గా కనిపిస్తోంది 'నీతో' మూవీ. బాలు శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా కనిపించబోతున్నారు. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ 'ఆనంద్', ఓ మంచి కాఫీలాంటి ఫీలింగ్ ఇచ్చింది. ఇప్పటికీ ఆ ఘుమఘుమలు ఫ్యాన్స్ కు ఆహ్లాదాన్ని పంచుతూనే ఉంది. ఆ ఫీలింగ్ ను మించిన కిక్ కోసం అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నీతో మూవీతో ఆ లోటు భర్తీ చేస్తామంటున్నారు ఆ చిత్ర బృందం. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే నిజంగానే ఆ ముచ్చట తీరుతుందేమో అనిపించక మానదు.

న్యూ ఏజ్ లవ్ స్టోరీని తలపిస్తున్న ఈ సినిమా కథను దర్శకుడు బాలు శర్మనే రాసుకున్నారు. నిరంతరం కనఫ్యూజన్ తో కొట్టుమిట్టాడే ఓ కుర్రాడు, లైఫ్ లో క్లారిటీ ఉన్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్న గమ్మత్తైన పాయింట్ తో కథ రాసుకున్న బాలు శర్మ సినిమాకు కావాల్సిన హంగులన్నీ సమకూర్చుకుని, పక్కా ప్లానింగ్ తో సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఏమైనా ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన 'నీతో' ఈ నెల 23వ తారీఖున థియేటర్లలో విడుదలవ్వబోతోంది. మరి ఈ సినిమాతో బాలు శర్మ మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా నిరూపించుకుంటారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











