Niharika Konidela: చిరంజీవి కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై మెగా డాటర్ వివరణ.. ఇంతకీ ఏమన్నారంటే?
ఎన్నో ఆశలు, కలలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే అమ్మాయిల్ని అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారిపై అత్యాచారాలు చేయడం, లైంగిక కోరికలు తీర్చుకోవడం వంటి క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎందరో హీరోయిన్లు, నటీమణులు తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అనుభవాలను, సంఘటనలను బయటపెడుతూనే ఉన్నారు. ఈ పరిణామాలతో తల్లిదండ్రులు.. తమ బిడ్డలను నటనా రంగం వైపు పంపాలంటేనే భయపడే పరిస్ధితులు నెలకొన్నాయి. కొద్దిరోజుల క్రితం మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్‌మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ క్యాస్టింగ్ కౌచ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆడబిడ్డయినా, మగబిడ్డయినా ఇండస్ట్రీ వెళ్తానంటే ఖచ్చితంగా ప్రోత్సహించాలి. చిత్ర పరిశ్రమ చాలా గొప్పది. ఇక్కడ నేను రాణించలేను, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి, బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ జరిగాయి అంటే అది నీ తప్పిదం అవుతుంది. నువ్వు స్ట్రిక్ట్‌గా ఉండి... సీరియస్‌గా ఉంటే ఒక్కడు కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి సాహసించరు. క్యాస్టింగ్ కౌచ్ అలాంటివి ఉండవు.. ఏదైనా నీ బిహేవియర్‌ను బట్టే ఉంటుంది. మీరు ప్రొఫెషనల్‌గా ఉంటే... అవతలి వాళ్లు కూడా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది... నువ్వు ఏం ఇస్తావో, తిరిగి అదే ఇస్తుంది. దృఢ సంకల్పంతో ఇండస్ట్రీకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ రాణిస్తారని చిరంజీవి వ్యాఖ్యానించారు. దాంతో మెగాస్టార్ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. తాజాగా ఈ వ్యవహారంపై మెగా డాటర్ నిహారిక కొణిదెల స్పందించారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాకాస చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఫాంటసీ, కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.
తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం జరగ్గా.. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది. దీనిలో భాగంగా... చిరంజీవి గారు ఇటీవల ఓ సందర్భంలో సుస్మిత గారి గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ఎవ్వరైనా రావచ్చు. క్యాస్టింగ్ కౌచ్ వంటి భయాలేం ఇక్కడ ఉండవు. టాలెంట్ కలిగిన వాళ్ళకే గుర్తింపు ఉంటుందన్నారు. దానిపై మీరేమంటారు అంటూ నిహారికని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానం ఇస్తూ... క్యాస్టింగ్ కౌచ్ అనే దానికి చాలా పెద్ద అర్ధం ఉంది. చట్టప్రకారంగా దానికి ఎన్నోసెక్షన్లు, అర్ధాలు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో దానికి ఒక్కటే అర్ధం ఉంది. అయితే పెదనాన్న చిరంజీవి గారు రెగ్యులర్‌గా అందరూ మాట్లాడుకునే దానిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడి ఉండొచ్చు అని నిహారిక వివరణ ఇచ్చారు.
రాకాస మూవీ హార్రర్ కామెడీ మూవీ కాదు.. ఫాంటసీ, హర్రర్ మూవీ. నేను పెద్దగా దెయ్యాల సినిమాలు చూడను.. నా లాంటి వాళ్లకు కొంచెం భయం వేస్తుంది. నేను కమిటీ కుర్రోళ్లు తీసినప్పుడు కూడా అది ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్తుందని అనుకోలేదు. రాకాసను కూడా చాలా ఇష్టంతో, చాలా ప్రేమతో తీశాం అది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. కొత్త టాలెంట్‌తో పనిచేయడం నాకు చాలా ఇష్టం. నేను కొణిదెల ఫ్యామిలీలో పుట్టాను. నన్ను సపోర్ట్ చేసే ఒక ఫ్యామిలీ ఉంది. సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉండే ఫ్యామిలీలో పుట్టాను. అలాంటి పరిస్ధితులు లేనివాళ్లకి, హైదరాబాద్ వచ్చి ఫిలింనగర్‌లో నాకు ఎవరు తెలుసు అని వెతుక్కోకుండా టాలెంట్ ఉన్న ఎవరైనా పింక్ ఎలిఫెంట్‌ను సంప్రదిస్తే, ఇంత లక్‌ని నేను మీకు అందిస్తానని నిహారిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











