Oka Chinna Family.. నిహారిక కొణిదెల నిర్మాతగా.. మంచి బజ్‌తో క్రేజీ వెబ్ సిరీస్
వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, ఒరిజినల్ మూవీస్, డిజిటల్ రిలీజ్‌లు... ఏవి చూడాలని అనుకున్నా ప్రజల ఫస్ట్ ఆప్షన్ 'జీ 5'. దేశంలోనే అగ్రగామి ఓటీటీ వేదిక. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. గత ఏడాది 'అమృత రామమ్' నుండి మొదలుపెడితే '47 డేస్', 'మేకా సూరి', 'బట్టల రామస్వామి బయోపిక్కు', ఇటీవల 'నెట్', 'అలాంటి సిత్రాలు' వరకూ ఎన్నో సినిమాలను 'జీ 5' డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఒరిజినల్ మూవీ 'హెడ్స్ అండ్ టేల్స్'ను విడుదల చేసింది. తాజాగా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (OCFS) ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా... సీనియర్ నరేష్, తులసి, 'గెటప్' శీను ప్రధాన, ప్రమీల రాణి (భామ) పాత్రల్లో నటించిన 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (OCFS). పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఆయనతో కలిసి మానసా శర్మ కథ, మాటలు అందించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్ గల ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19న 'జీ 5' ఓటీటీ వేదికలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్ తేజ్, వెబ్ సిరీస్ లో 'అరే మహేషా...' పాటను విడుదల చేశారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ "బహుశా... ఏడాది క్రితం వెబ్ సిరీస్ చేస్తున్నట్టు నిహారిక చెప్పింది. స్టోరీ, టైటిల్ ఏమీ చెప్పలేదు. తనకెప్పుడూ 'ఇది చెయ్, అది చెయ్' అని చెప్పలేదు. ప్రయోగాలు చేస్తూ తన దారి వెతుక్కోవాలని అనుకుంటుంది. నిహారిక వర్క్ లో మేం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వం. చూసి బావుందో, లేదో చెబుతాం. ఇటీవల ట్రైలర్ చూపించినప్పుడు నిజంగా నేను షాకయ్యా. ట్రైలర్ బావుంది. నాకు సంతోష్ శోభన్ తెలుసు. కానీ, తనకు బ్రదర్ ఉన్నాడని తెలియదు. ట్రైలర్ చూశాక... 'ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగా చేస్తున్నాడు. ఇంతకు ముందు ఎన్ని సినిమాలు చేశాడు?' అని అడిగా. తన టైమింగ్, యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. నేను ఈ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడానికి గల కారణాల్లో అతడూ ఒకడు. సంతోష్, సంగీత్ ను చూసి వాళ్ల నాన్నగారు గర్వపడతారు. నరేష్ గారి లాంటి ఆర్టిస్ట్ సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులు చేయడం కొత్తవాళ్లకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అందరూ సినిమా క్వాలిటీలో ఉందని చెబుతున్నారు. పోను పోనూ సినిమాకు, ఓటీటీకి డిఫరెన్స్ ఉండదు. మనం చూసే మీడియమ్ డిఫరెంట్ అవ్వొచ్చు. సినిమా అంటే థియేటర్లు, ఓటీటీ అంటే ఇంట్లో చూడవచ్చు. అందరం కంటెంట్ ను నమ్ముకుని వచ్చినవాళ్లం. సినిమా వల్ల చాలామందికి ఒక ఫ్లాట్‌ఫార్మ్ ఉంటుంది. బయట ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అయితే, సినిమా వల్ల వాళ్లందరికీ ఒక లెవల్ వరకూ అవకాశాలు వస్తాయి. ఓటీటీ వల్ల చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. ఇటువంటి ఫ్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసిన 'జీ 5' వాళ్లకు థాంక్స్. ఈ నెల 19న 'జీ 5' ఓటీటీలో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ ఇంట్లో ఫ్యామిలీస్ తో కూర్చుని ఈ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.
నరేష్ వీకే మాట్లాడుతూ "ఒక్కొక్క ఫ్యామిలీకి సముద్రమంత లోతు ఉంటుంది. మానస, మహేష్ ఉప్పాల మంచి ఫ్యామిలీ క్రియేట్ చేశారు. నేను రెండొందల సినిమాలు చేశానేమో? కౌంట్ చేయలేదు. లవ్లీ వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ'తో కొత్త ప్రయాణం ప్రారంభించడం సంతోషంగా ఉంది. మా నిర్మాత నిహారికాకు ముందుగా థాంక్స్ చెప్పాలి. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే టైటిల్ తో ఎంతో వెయిట్ ఉంది. ప్రతి ఫ్యామిలీలో ఒక స్టోరీ ఉంటుంది. అది వాళ్లకే తెలుస్తుంది. బయట వాళ్లకు చాలా తక్కువ తెలుస్తుంది. దాన్ని చాలా అందంగా రాశారు. 27 రోజుల్లో తీశారంటే... చుట్టేశారని అనుకోవద్దు. సెట్ లో ఒక్క నిమిషం వేస్ట్ కాకుండా పక్కా ప్లానింగ్ తో చేశారు. మంచి క్వాలిటీతో తీశారు. సంగీత్ చాలా నేచురల్ గా చేశాడు. అతని అన్నయ్య సంతోష్ కు అదే విషయం చెప్పాను. వాళ్లది ఫిల్మ్ ఫ్యామిలీ. సంగీత్ తండ్రి శోభన్ మాకు క్లోజ్" అని అన్నారు.
నిహారికా కొణిదెల మాట్లాడుతూ "ఆరేళ్ల క్రితం 'ముద్దపప్పు ఆవకాయ్'తో పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను... నా ఫ్రెండ్ తో కలిసి! తర్వాత పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ లో మా నాన్నగారితో కలిసి 'నాన్నకూచి' అని ఇంకో వెబ్ సిరీస్ చేశా. ఆ రెండు ప్రాజెక్ట్స్ 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నా ప్రొడక్షన్ హౌస్ వరకూ 'జీ 5' ఇల్లు లాంటిది. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'... ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా. ఈ మూడు ప్రాజెక్ట్స్ నాకు చాలా స్పెషల్. నాకు బాగా నచ్చి ముందునుంచి వీటితో ట్రావెల్ అయ్యాను. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' గురించి చెప్పాలంటే... నాకు మహేష్ గారు, మానస ముందు చెప్పినప్పుడు... 'మహేష్ గారు! ఇది మీ కథేనా? మీకు లోన్స్ ఉన్నాయా?' అని అడిగేశాను. 'లేవు. నేను చూసిన సంఘటనల నుంచి రాసిన కథ' అన్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దర్శకుడు మహేష్, ఆయనతో పాటు కథ రాసిన మానస నిద్ర లేకుండా రేయింబవళ్లు కష్టపడ్డారు. నటుడిగా, వ్యక్తిగా సంగీత్ శోభన్ ను ఇష్టపడనివారు ఉండరు అని అన్నారు.
చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుతూ "నిర్మాతగా నీహా (నిహారికా)ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ చేసింది. అప్పుడు నేను లేను. ఈ ప్రాజెక్టు చేసేటప్పుడు తనను దగ్గరనుంచి చూశా. నిర్మాతగా నిహారిక చాలా టెన్షన్స్ తీసుకుంది. నేను రెండుమూడు సార్లు సెట్స్ కు వెళ్లాను. చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా స్పీడుగా చేశారు. 27 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు.
సంగీత్ శోభన్ మాట్లాడుతూ "మా ఫస్ట్ పోస్టర్ విడుదల చేసిన నాగబాబుగారికి, టీజర్ విడుదల చేసిన నానిగారికి, ట్రైలర్ విడుదల చేసిన నాగార్జునగారికి థాంక్స్. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన వరుణ్ తేజ్ గారికి థాంక్స్. ఇవన్నీ మీకు చిన్న విషయాలు అయ్యి ఉండొచ్చు. కానీ, మాకు పెద్ద పెద్ద విషయం. మీలాంటి పెద్దవాళ్లు సపోర్ట్ చేస్తేనే మేం 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' చెప్పగలం అని అన్నారు.
సిమ్రాన్ శర్మ మాట్లాడుతూ "ఈ వెబ్ సిరీస్ చేసే క్రమంలో టీమ్ అందరం ఒక చిన్న ఫ్యామిలీ అయిపోయాం. ఈ ఫ్యామిలీలో నేను ఒక పార్ట్ కావడం సంతోషంగా ఉంది. మా నిర్మాత నిహారికకు థాంక్స్" అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరశంకర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ ఎడ్రోల్, మ్యూజిక్ డైరెక్టర్ పీకే, నటుడు 'గెటప్' శీను, సీనియర్ నటి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











