THAMMUDU: పవన్ టైటిల్‌తో నితిన్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వకీల్ సాబ్ డైరెక్టర్
టాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న యంగ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. 'జయం' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలతో సతమతం అయినా మళ్లీ తేరుకుని రేస్‌లోకి వచ్చేశాడు.
'భీష్మ' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తోన్న నితిన్.. అందుకోసం సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. కానీ, సరైన ఫలితాలను మాత్రం రాబట్టలేకపోతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ హిట్‌ను కొట్టాలన్న కసితో వెంకీ కుడుములతో ఒక మూవీని, వక్కంతం వంశీతో మరో మూవీని చేస్తున్నాడు. ఇవి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న నితిన్.. ఇప్పుడు తన కొత్త సినిమాను 'వకీల్ సాబ్' ఫేం వేణు శ్రీరామ్‌తో చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఆఫీస్‌లో జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి సహా కొందరు హాజరయ్యారు.

దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించినున్న ఈ సినిమాకు 'తమ్ముడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. 'కొన్ని టైటిల్స్ ఎంతో బాధ్యతను పెంచేలా వస్తాయి. ఈ సినిమా మీ అంచనాలను మించేలా ఉంటుంది. నా కొత్త సినిమా వేణు శ్రీరామ్, దిల్ రాజు గారితోనే' అంటూ ట్వీట్ చేశాడు.
పవన్ కల్యాణ్ అభిమాని అయిన నితిన్ ఇప్పుడు ఆయన టైటిల్ 'తమ్ముడు'తోనే వస్తుండడంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే అన్నీ పూర్తి చేసి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలిసింది. ఇక, ఇందులో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
ఇదిలా ఉండగా.. వాస్తవానికి ఇదే కాంబినేషన్‌లో అల్లు అర్జున్ 'ఐకాన్' అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో అది పట్టాలెక్కలేదు. దీంతో నితిన్ ఇదే కథతో, టైటిల్‌తో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే, ఇప్పుడు 'తమ్ముడు' టైటిల్ పెట్టి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇది వేరే కథతో వస్తుందని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











