మరోసారి హిట్ ఇచ్చిన దర్శకుడితో నితిన్ మూవీ.. రంగంలోకి బడా నిర్మాణ సంస్థ!
టాలీవుడ్ యువ హీరో నితిన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. నితిన్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయినప్పటికీ కూడా అతనికి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఒక విధంగా అతని మార్కెట్ స్థాయి కూడా ఏమాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. ప్రతి సినిమాకు కూడా నితిన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంటున్నాడు.
నితిన్ రెగ్యులర్ గా ఒకే తరహాలో సినిమాలు చేసుకుంటూ వెళ్లకుండా మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. అయితే నితిన్ కు 2020లో భీష్మ సినిమా తర్వాత మళ్లీ సరైన సక్సెస్ దొరకలేదు. గత ఏడాది వచ్చిన చెక్, రంగ్ దే సినిమాలు రెండు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక మాస్ట్రో సినిమా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అందులో నితిన్ నటనకు మంచి గుర్తింపు లభించింది.

ఇక ఈ ఏడాది వచ్చిన మాస్ కమర్షియల్ మూవీ మాచర్ల నియోజకవర్గం కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరొక రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. అయితే నితిన్ తనకు చివరిగా సక్సెస్ అందించిన భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతోనే మరొక సినిమా చేయబోతున్నాడు.
ఇక వీరి కలయికలో తెరపైకి రాబోయే సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఇప్పటికే స్టోరీ కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే దర్శకుడు వెంకీ కుడుముల ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేసేందుకు చర్చలు జరిపాడు. అయితే ఆ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అయ్యేలా ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు నితిన్ తో కూడా అతను ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. నితిన్ కు కూడా కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం నితిన్ కమిట్మెంట్ ప్రకారం ఒప్పుకున్న ప్రాజెక్టుల్లో ఒకటి పూర్తికాగానే వెంకీ కుడుములతో కొత్త సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











