మోత మోగించబోతున్న ‘మాస్ట్రో’: ఆ ఓటీటీ సంస్థతో కలిసి నితిన్ బిగ్ ప్లాన్
ఈ మధ్య కాలంలో తెలుగులో రీమేక్ మూవీల హవా కనిపిస్తోంది. ఇప్పటికే పలు భాషలకు సంబంధించిన ఎన్నో చిత్రాలు టాలీవుడ్‌లోని అనువాదం అయ్యాయి. మరికొన్ని పట్టాలపై ఉన్నాయి. అలాంటి వాటిలో యూత్ స్టార్ నితిన్.. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న 'మాస్ట్రో' ఒకటి. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'అంధాధున్' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఇది రీమేక్‌గా వస్తోంది. కొన్ని రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ లీకైంది.
కొద్ది రోజుల్లో 'మాస్ట్రో' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాబోతున్నాయి. దీని తర్వాత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సమయం ఆసన్నమవడంతో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇందులో భాగంగానే త్వరలోనే ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తాజాగా తెలిసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ కూడా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో 'మాస్ట్రో మ్యూజిక్ ఫీస్ట్ వచ్చే వారం నుంచి' అని పేర్కొంది. ఇక, దీని కోసం మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అద్భుతమైన ట్యూన్స్‌ను రెడీ చేశాడని తెలుస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మాస్ట్రో' సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతుంది. ఇందులో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications











