రికార్డులు క్రియేట్ చేస్తోన్న ‘చెక్’ ట్రైలర్: నితిన్ కెరీర్‌లోనే తొలిసారి ఇలా
'జయం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. ఆ వెంటనే 'దిల్'తో మరో విజయాన్ని అందుకున్న అతడు.. కెరీర్ ఆరంభంలోనే వరుసగా కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, చాలా కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. 'ఇష్క్' సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలు అందుకుంటూ సమతూకంగా సాగిపోతున్నాడు. ఇక, గత ఏడాది 'భీష్మ'తో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ జోష్‌లోనే మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు.
నితిన్ ప్రస్తుతం వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో 'చెక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. చలాకీగా తిరిగే ఓ కుర్రాడికి దేశ ద్రోహం కేసులో ఉరి శిక్ష పడుతుంది. జైలులో ఖైదీగా ఉన్న సమయంలో చెస్ ప్లేయర్‌గా మారి దేశానికి ఎలా విజయాన్ని అందించాడు అన్న కథతో ఈ మూవీ రూపొందింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ లాయర్‌గా, ప్రియా ప్రకాశ్ వారియర్.. నితిన్ ప్రియురాలిగా నటిస్తున్నారు.

ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్.. బుధవారం సాయంత్రం విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన రావడంతో యూట్యూబ్‌లో నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్‌తో పాటు రెండు లక్షలకు పైగా లైకులతో సత్తా చాటుతోంది. ఫలితంగా ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ అందుకుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.


Click it and Unblock the Notifications











