ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్.. బాలకృష్ణ పిలిచింది వీరినే.. చిరు వస్తున్నారా అంటే..
టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొంటున్న ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు ముస్తాబవుతున్నది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు అనే పేర్లతో రెండు భాగాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను డిసెంబర్ 21న నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో జరిగే కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
తెలుగు జాతి గర్వించదగిన మహా నటుడు, నేత ఎన్టీఆర్ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా కథానాయకుడు, మహానాయకుడు అనే పేర్లతో తెరకెక్కించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరవుతున్నారు అని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపారు.

కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు తదితరులు
అట్టహాసంగా నిర్వహించనున్న ఈ వేడుకకు రావాలని ఇప్పటికే తెలుగు సినీ దిగ్గజాలకు, ప్రముఖును బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ కృష్ణ, రెబెల్‌స్టార్ కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్‌బాబు, జమున, గీతాంజలి, ఇంకా చాలా మంది అలనాటి ప్రముఖులు, నటులు, నేటితరం స్టార్లు హాజరుకానున్నారు అని ప్రకటనలో వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి హాజరుపై
ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారా అనే విషయంపై క్లారిటీ లేదు. అటు సినిమా వర్గాలు కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎన్టీఆర్ చిత్రాల్లో చిరంజీవి ప్రత్యేక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్‌తో కలిసి మెగాస్టార్ నటించి మెప్పించారు కూడా.

చిత్ర యూనిట్ సభ్యులు అంతా
బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించే నటీనటులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌పై రూపొందించిన వీడియోలు ప్రత్యేక ఆకర్షణగా మారుతాయని పేర్కొంటున్నారు.

నటీనటులు, సాంకేతికవర్గం
నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్, నందమూరి కల్యాణ్ రాం, రానా దగ్గుబాటి, సుమంత్, జిష్షు సేన్ గుప్తా, నిత్యా మీనన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. జీ శేఖర్ సినిమాటోగ్రఫి, సాయి మాధవ్ బుర్రా మాటలు, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











