నువ్వు తోపురాకు అరుదైన గుర్తింపు.. ఉటా ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు
అమెరికాలోని శ్రీకాంత్, జేమ్స్ వాట్, రితేష్ కుమార్ నిర్మాతలుగా దర్శకుడు హరినాథ్ బాబు దర్శకత్వంలో రూపొందిన నువ్వు తోపురా చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. దాదాపు ఎక్కువ భాగం అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. 70 శాతం అమెరికాలో, 30 శాతం ఇండియాలో షూట్ జరిగింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం యూఎస్‌లోని ఉటా ఫిలిం ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శకుడు హరినాథ్ బాబు తెలుగు ఫిల్మీబీట్ విషయాలను వెల్లడించారు.
వాస్తవానికి ఉటా ఫిల్మ్ ఫెస్టివల్ ఏప్రిల్ 2020లో నిర్వహించాల్సింది. కానీ కరోనావైరస్ లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇటీవల పరిస్థితులు సానుకూలంగా మారడంతో ఈ ఫెస్టివల్‌ను ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 19 తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు.

ఫెస్టివల్ నిర్వాహకులు వారెన్ వర్క్‌మెన్ నువ్వు తోపురా సినిమాకు సంబంధించిన విషయాలపై ప్రశ్నోత్తరాలను ఆన్‌లైన్ ద్వారా జరిపారు. ఈ ఫెస్టివల్‌లో క్రిటిక్స్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, మ్యూజిక్ విభాగాల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. మా సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాలకు మంచి రేటింగ్ ఇవ్వడం మాకు చాలా ఆనందం కలిగించింది అని దర్శకుడు హరినాథ్ బాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ హరినాథ్ బాబు మాట్లాడుతూ.. నా నిర్మాతలు శ్రీకాంత్, జేమ్స్ వాట్, రితేష్ కుమార్ నాకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చారు. ఉన్నత సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ క్వాలిటీ కోసం ఖర్చుకు వెనుకాడలేదు. ఉటాలో షూటింగ్ జరిగిన రోజుల్లో నిర్మాతలు అందించిన సహకారం నా జీవితంలో మరువలేను. ఈ సినిమా కోసం అమెరికావాసులు, తెలుగు కమ్యూనిటీ అందించిన సహకారం మాటల్లో చెప్పలేను. ఈ అవార్డు రావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. ఎవరైనా ఈ చిత్రాన్ని చూడకపోతే యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, ఆహా యాప్‌లో చూడవచ్చు అని అన్నారు.

నిర్మాత జేమ్స్ వాట్ మాట్లాడుతూ.. నువ్వు తోపురా సినిమాకు ఉటా ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు హరినాథ్ వెరీ టాలెంటెడ్, ప్రతిభావంతుడు. ఎన్నారై, ఇండియన్ యాక్టర్లతో మంచి అవుట్‌పుట్ అందించారు. ఈ సినిమాలో భాగమైన హీరో సుధాకర్, హీరోయిన్ నిత్యాశెట్టికి అభినందనలు అని అన్నారు.


Click it and Unblock the Notifications











