ఓజీ 2లోకి సుజీత్ గ్రాండ్ ఎంట్రీ.. పవన్ కళ్యాణ్‌తో క్రేజీ సీక్వెల్‌కి ముహూర్తం ఎప్పుడంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అసలు సిసలు విందు భోజనాన్ని అందించిన మూవీ ఓజీ. పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ నట విశ్వరూపానికి బాక్సాఫీస్ షేక్ అయ్యింది. పవన్‌ను అభిమానులు తెరపై ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించి బ్లాక్‌బస్టర్ హిట్ అందించారు సుజీత్. పవన్ నట జీవితంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఓజీ నిలిచింది.

ఈ మూవీ థియేటర్‌లో ఉండగానే దీనికి సీక్వెల్ తీయాలంటూ అభిమానులు కోరుకున్నారు. దీనికి పవన్ కళ్యాణ్, సుజీత్‌లు సానుకూలంగానే స్పందించారు. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో మరో సినిమా చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సుజీత్ తనతో షూటింగ్ చేసిన తీరు బాగుందని, ఇదే ప్లానింగ్‌తో తన వద్దకు వస్తే ఖచ్చితంగా మరో సినిమా ఉంటుందని పవర్‌స్టార్ హింట్ ఇచ్చారు.

OG 2 Sujeeth Meets Pawan Kalyan for OG Universe Discussions

గతేడాది సెప్టెంబర్ 25న విడుదలైన ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిసారిగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను క్రాస్ చేసి ఆయన స్టామినా ఏంటో చూపించింది. ప్రీమియర్ షోల వసూళ్లు, ఓపెనింగ్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అప్పట్లో హరిహర వీరమల్లు డిజాస్టర్‌తో నిరాశలో ఉన్న పవన్ ఫ్యాన్స్‌కు ఓజీతో ఉపశమనం కలిగించారు సుజీత్. ఈ విజయం పవన్ కళ్యాణ్‌లోనూ మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. తనకు మెమొరబుల్ హిట్‌ను అందించినందుకు గాను సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందించి సర్‌ప్రైజ్ చేశారు పవర్‌స్టార్.

ఇదే ఊపులో ఓజీ యూనివర్స్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని ఓజీ 2కి సైలెంట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. జపాన్‌లో ఓజీ ఏం చేశాడు? అక్కడ యాకూజా గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అనే దానిని బేస్ చేసుకుని ఓజీ 2ని సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ లోగా పవన్ రాజకీయాల్లో బిజీ కావడం, సుజీత్ కూడా నేచురల్ స్టార్ నానితో ది బ్లడీ రోమియో ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. దాంతో ఇక ఓజీ 2 ఇప్పట్లో ఉండదని అభిమానులు సైతం నిరాశపడ్డారు.

అయితే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ది ప్యారడైజ్ షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం.. బ్లడీ రోమియో ఎప్పుడు ప్రారంభమవుతుందో అంచనాలు లేకపోవడంతో ఈ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్‌తో ఓజీ 2ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సుజీత్ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. దీనిని కన్ఫర్మ్ చేస్తూ పవర్ స్టార్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఓజీ 2 విషయంలో కీలక ప్రకటన చేసింది. ఇచ్చిన మాట ప్రకారమే ఆయన చేస్తారు. అది ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన వెంటనే కథా చర్చలు మొదలవుతాయని ఇటీవల ఆ సంస్థ ట్వీట్ చేసింది.

విదేశాల నుంచి తిరిగొచ్చిన సుజీత్.. జూన్ 21న హైదరాబాద్‌‌లో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఓజీ 2 స్క్రిప్ట్‌ను పవన్‌కు వినిపించడంతో పాటు మార్పులు చేర్పులపై వీరిద్దరూ చర్చించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారమే సుజీత్‌తో ఓజీ యూనివర్స్ డిస్కషన్స్ మొదలయ్యాయని తెలిపింది. అలాగే పవన్, సుజీత్ భేటీ అయిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ స్క్రిప్ట్‌కు పవన్ కళ్యాణ్ ఆమోదముద్ర లభించిన వెంటనే త్వరలోనే ఓజీ 2 ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడ అవకాశం ఉంది. దసరా తర్వాత ఈ క్రేజీ సీక్వెల్‌ గ్రాండ్ ఓపెనింగ్ జరుపుకుని సెట్స్ మీదకి వెళ్తుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఓజీ 2 నిర్మాణంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా చేతులు కలపబోతోందని టాక్. దీంతో ఓజీ 2లో పవన్ కళ్యాణ్‌ను సుజీత్ ఎలా చూపించబోతున్నారోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Read more about: sujeeth pawan kalyan og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X