Top Heroes: ఇండియాలో నంబర్ 1 హీరోగా ప్రభాస్.. అల్లు అర్జున్, మహేష్, రాంచరణ్‌కు ఎన్నోస్థానమంటే?
Ormax Most Popular Actor: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ (Ormax) తాజాగా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో మరోసారి టాలీవుడ్ స్టార్స్ హవా కనిపించింది. 2025 డిసెంబర్ కు సంబంధించి పాపులర్ నటీనటుల లిస్ట్ ను (Most Popular Male Film Stars in India - December 2025) ఆర్మాక్స్ రిలీజ్ చేసింది. జాబితాలో మరోసారి టాలీవుడ్ స్టార్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ, సెలబ్రెటీ, క్రేజ్‌ను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ లిస్ట్‌లో తెలుగు హీరోల పేర్లు మార్మోగిపోయాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి నెంబర్ వన్ స్థానం దక్కించుకుని తన రేంజ్ ఏంటో రుజువు చేశారు.
మరోసారి టాలీవుడ్ హవా
తాజా ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే బాలీవుడ్ స్టార్ హీరోలను వెనక్కినెట్టి మన తెలుగు తారలు అత్యుత్తమ స్థానాలు దక్కించుకున్నారు. దీంతో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రెండో స్థానంలో నిలవగా, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరోసారి టాప్ 3కే పరిమితమయ్యారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితా చూస్తే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిరుచులు ఏ దిశగా మారుతున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది.

ప్రభాస్ హవా..
బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ ర్యాంకింగ్ మరోసారి నిరూపించింది. ప్రస్తుతం 'ది రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్.. దేశంలోనే మోస్ట్ పాపులర్ స్టార్‌గా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌లో ఆయనకు ఉన్న ఇమేజ్, ఫ్యాన్ బేస్ ఈ విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
విజయ్- రాజకీయాల్లోకి వెళ్తున్నా తగ్గని క్రేజ్
రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నా కూడా దళపతి విజయ్ (Vijay) క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ లిస్ట్ చాటి చెబుతోంది. తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానంతో విజయ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సినిమా రంగంలో ఉన్నంతకాలం మాత్రమే కాదు, వ్యక్తిగత ఇమేజ్ కూడా పాపులారిటీపై ఎంత ప్రభావం చూపుతుందో విజయ్ ఉదాహరణగా నిలుస్తున్నారు.
అల్లు అర్జున్: నార్త్‌లోనూ ఐకాన్ స్టార్
'పుష్ప' సినిమాతో నార్త్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకున్న అల్లు అర్జున్, 'పుష్ప 2'పై ఉన్న భారీ హైప్‌తో నాలుగో స్థానంలో నిలిచారు. మాస్, స్టైల్, యాటిట్యూడ్... అన్నీ కలగలిసిన పాత్రలతో ఐకాన్ స్టార్ నార్త్ మార్కెట్‌లోనూ తన స్థానం పక్కాగా నిలబెట్టుకున్నారు. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకు రానున్నారన్న అంచనాలు కూడా పాపులారిటీకి తోడ్పడుతున్నాయి.
టాప్ 10లో టాలీవుడ్ జాతర
టాప్ 10 లిస్ట్‌ను చూస్తే ఇది ఓవరాల్ ఇండియన్ సెలబ్రిటీల జాబితానా? లేక టాలీవుడ్ లిస్టా? అనే సందేహం కలగడం సహజం. ఎందుకంటే బాలీవుడ్ నుంచి కేవలం ముగ్గురికే ఈ జాబితాలో స్థానం దక్కింది. అందులో షారుక్ ఖాన్ 3వ స్థానం, సల్మాన్ ఖాన్ 9వ స్థానం, అక్షయ్ కుమార్ 10వ స్థానంలో నిలిచారు. మిగతా స్థానాలన్నీ సౌత్ స్టార్లవే. ప్రభాస్ నెంబర్ వన్‌గా నిలవగా, అల్లు అర్జున్ టాప్ 4లో, రాజమౌళితో గ్లోబల్ సినిమాకు రెడీ అవుతున్న మహేశ్ బాబు 5వ స్థానంలో, రామ్ చరణ్ 7వ స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్ 8వ స్థానంలో నిలిచారు. తమిళ స్టార్ అజిత్ కుమార్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు.
మారుతున్న ట్రెండ్
ఒకప్పుడు ఖాన్ త్రయం (షారుక్, సల్మాన్, ఆమిర్) లేని టాప్ లిస్ట్ ఊహించడమే కష్టం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. అమీర్ ఖాన్ టాప్ 10లో కూడా లేకపోవడం, సల్మాన్ ఖాన్ చివరి స్థానానికి పరిమితమవడం. ప్రేక్షకుల అభిరుచులు ఎంతగా మారాయో సూచిస్తున్నాయి. నార్త్ ఆడియన్స్ ఇప్పుడు మాస్, ఎమోషన్, లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు. ఆ కంటెంట్ ఇవ్వడంలో సౌత్ దర్శకులు, హీరోలు సక్సెస్ కావడమే.. 'ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదు, టాలీవుడ్' అని గర్వంగా చెప్పుకునే స్థాయికి మన సినిమాను తీసుకెళ్లింది.


Click it and Unblock the Notifications











