నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం.. మీ వల్లే అంటూ ఎస్పీ చరణ్ ఎమోషనల్
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తన తండ్రి ఆరోగ్యం గురించి స్పష్టంగా వివరించారు. వీడియోలో ఎస్పీ చరణ్ మాట్లాడుతూ..
నా తండ్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడాను. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్సకు స్పందిస్తున్నారు. డాక్టర్ల చెప్పిన మాటలకు ఆయన స్పందిస్తున్నారు. దాదాపు 95 శాతం మగత నుంచి బయటకు వచ్చారు. ఇది మంచి ఫలితమని డాక్టర్లు చెప్పారని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.

ఎంజీఎం హస్పిటల్ వైద్యుల అద్బుతమైన చికిత్స, సేవల వల్లే ఆయన కోలుకొనేలా చేస్తున్నాయి. అలాగే మా కుటుంబం, అభిమానులు, స్నేహితులు, సన్నిహితుల ప్రార్థనల వల్ల సానుకూలత ఏర్పడింది. ఆయన త్వరలోనే ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నా తండ్రి ఆరోగ్యం గురించి ప్రతీ ఒక్కరు తమిళం, కన్నడ, మలయాళంలో వీడియో పెట్టమని కోరుతున్నారు. అందుకే తాను ఇంగ్లీష్‌లో వీడియోను రిలీజ్ చేస్తున్నాను. అందరికీ అర్ధమయ్యేందుకే నేను ఆంగ్లంలో వీడియోను రిలీజ్ చేస్తున్నాను అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
ప్రముఖ గాయకుడు, నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనావైరస్ బారిన పడి ఆగస్టు 5వ తేదీన హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆగస్టు 5వ తేదీన ఆయన ఓ వీడియోను రిలీజ్ చేసి కరోనా పాజిటివ్ తేలిందని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.


Click it and Unblock the Notifications











