Padma Awards 2025: పద్మ అవార్డు అందుకొన్న బాలకృష్ణ, అజిత్.. పంచెకట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా బాలయ్య!
కళలు, పారిశ్రామిక రంగాలకు, అలాగే సామాజిక సేవ, ఇతర రంగాల్లో విశేష ప్రతిభ, సేవలు అందించిన ప్రముఖులకు ఇచ్చే పద్మ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన, ఆమె చేతుల మీదుగా పద్మ విజేతలకు పురస్కరాలను అందజేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
భారతీయ సినిమాకు సంబంధించిన నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్‌కు ఈ అవార్డులను అందజేశారు. వీరిద్దరికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగిన వేడుకలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు అవార్డులను అందుకొన్నారు.

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఫుల్ బ్లాక్ సూట్‌లో అవార్డుల వేడుకకు హాజరయ్యారు. తన పేరు ప్రకటించగానే ఆయన హుందాగా లేచి నిలబడి.. అతిథులు, ప్రభుత్వ పెద్దలకు అందరికి ప్రణామం చేసి.. వినమ్రంగా నడుచుకొంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్లారు. రెండు చేతులు జోడించి నమస్కరించి అవార్డును స్వీకరించారు. అజిత్ అవార్డు అందుకొంటున్న సమయంలో సభలో ప్రతీ ఒక్కరు చప్పట్లు కొట్టి అభినందించారు.
తెలుగు సినిమా పరిశ్రమ నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా పంచ, లాల్చి ధరించి.. మెడలో కండువా ధరించి అందర్నీ ఆకట్టుకొన్నాడు. ఈ వేడుకకు హాజరైన అతిథులకు అభివాదం చేశారు. రాష్ట్రపతి ముర్ము వద్దకు వినమ్రంగా వెళ్లి అవార్డును అందుకొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.
నందమూరి బాలకృష్ణ పద్మ అవార్డు అందుకోవడంపై తెలుగు సినిమా ప్రముఖులు, మీడియా వర్గాలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ సందేశంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారికంగా ఓ ప్రకటనను జారీ చేస్తూ.. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకులు నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో బాలకృష్ణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చారిత్రక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొన్నది. ప్రజాసేవలో, కళా సేవలో బాలకృష్ణ మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని ఆకాంక్షిస్తున్నాను అని ఓ ప్రకటనను విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











