Pankaj Dheer: నటుడు పంకజ్ ధీర్ కన్నుమూత... బుల్లితెర కర్ణుడి మృతికి కారణమేంటీ?
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు పంకజ్ ధీర్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారినపడిన ఆయన ఆ మహమ్మారిపై పోరాటం చేశారు. పలు శస్త్ర చికిత్సలు కూడా చేయించుకున్నారు. ఈ పోరాటంలో అలిసిపోయిన పంకజ్ ధీర్ అక్టోబర్ 15వ తేదీన ముంబైలో తుదిశ్వాస విడిచారు. మూడు దశాబ్ధాల క్రితం దూరదర్శన్‌లో వచ్చిన మహాభారత్ సీరియల్‌లో కర్ణుడిగా అద్భుతంగా నటించారు.

పంకజ్ ధీర్ ప్రస్ధానం
9 నవంబర్ 1956న పంజాబ్‌లో జన్మించారు. బుల్లితెరపై అడుగుపెట్టడానికి ముందే దర్శకుడిగా, నటుడిగా ఆయన చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యారు. తొలుత 1970లో పర్వానా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే 1981లో పూనం అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సూఖ, రండం వారవు, జీవన్ ఏక్ సంఘర్ష్, సౌగంధ్, సాదక్ , మిస్టర్ బాండ్, జాగృతి, పర్దేశి, నిషానా, సోల్జర్, బాద్షా, ఓమ్, జామీన్, టార్జన్ : ది వండర్ కార్, విష్ణు సేన, గిప్పి, మహాభారత్ ఔర్ బార్బరీక్ సినిమాలలో నటించారు.
కర్ణుడిగా పాపులర్
అయితే పంకజ్ ధీర్‌కు గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం.. 1988లో బీఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన మహాభారత సీరియల్‌తోనే. ఇందులో కర్ణుడి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1988 అక్టోబర్ 2 నుంచి 1990 జూన్ 24 వరకు దూరదర్శన్‌లో మహాభారత్ సీరియల్ 94 ఎపిసోడ్ల పాటు ప్రసారమైంది. అయితే తొలుత ఈ సీరియల్‌లో పంకజ్ ధీర్‌ని అర్జునుడి పాత్రకు సెలెక్ట్ చేశారు. అయితే మీసాలు తీయడానికి ఆయన అంగీకరించకపోవడంతో ఈ రోల్ మిస్ అయ్యింది.
అర్జునుడి పాత్ర అలా మిస్
నిర్మాత బీఆర్ చోప్రా సహా పలువురు యూనిట్ సభ్యులు పలుమార్లు చెప్పి చూసినా.. మీసాలు లేకుండా నా ఫేస్ బాగుండదని చెప్పి అర్జునుడి రోల్ తిరస్కరించారు పంకజ్. దాంతో ఆయనను ఆఫీస్ నుంచి బయటికి పంపేసి, కాంట్రాక్ట్‌ను చింపేశారు. ఈ పరిణామంతో ఆరు నెలల పాటు ఏదో పని చేసుకుంటూ గడిపిన పంకజ్‌కు మరోసారి బీఆర్ చోప్రా కాల్ చేశారు. ఇదే మహాభారత్‌లో కర్ణుడి పాత్ర చేస్తావా? అని అడగ్గా.. మీసాలు కత్తిరించుకోవాల్సిన అవసరం లేకపోతే నాకు ఓకే అని పంకజ్ అనగా.. బీఆర్ చోప్రా అవసరం లేదని అన్నారు. దాంతో కర్ణుడి పాత్ర పంకజ్‌కు దక్కింది. ఈ పాత్రలో విశ్వరూపం ప్రదర్శించిన ఆయన .. కర్ణుడంటే ఆయనే అన్నంతగా బ్రాండ్ సంపాదించారు. అది ఎంతలా అంటే ఏకంగా పుస్తకాల్లో కర్ణుడి బొమ్మ కావాల్సి వస్తే పంకజ్ ధీర్ ఫోటోలనే వేసేవారు.
స్టూడియో అధినేత
2006లో తన సోదరుడు సట్లేజ్ ధీర్‌తో కలిసి ముంబైలోని జోగేశ్వరిలో విసాగే స్టూడియోస్‌ను స్థాపించిన ఆయన సినిమా షూటింగ్‌లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. అలాగే ఔత్సాహిక నటీనటుల కోసం నటుడు గుఫి పెయింటాల్‌తో కలిసి ముంబైలో అభినయ్ యాక్టింగ్ అకాడమీని స్థాపించి సినీ రంగానికి తన వంతు సేవ చేస్తున్నారు.
పంకజ్ వారసుడిగా నికితిన్ ధీర్
నటి అనిత ధీర్‌ను పంకజ్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నికితిన్ ధీర్ సంతానం. ఈయన కూడా తండ్రి బాటలోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. జోథా అక్బర్, సూర్యవంశీ, చెన్నై ఎక్స్‌ప్రెసతో పాటు తెలుగులో కంచె, గౌతమ్ నందా, మిస్టర్, ఖిలాడి తదితర సినిమాలలో నటించారు. ఈ ఏడాది హౌస్‌ఫుల్ 5, అకాళ్: ది అన్ కాంకేర్డ్ సినిమాలతో నికితిన్ ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ బుల్లితెర నటి క్రతికా సెంగార్‌ను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె. పంకజ్ ధీర్ మరణం పట్ల మహాభారత్ సీరియల్‌లో ఆయన సహనటుడు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











