Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్-శ్రీలీల సీన్ లీక్.. స్టైలీష్ లుక్‌లో పవర్‌స్టార్‌ని చూశారా!
ఏపీ డిప్యూటీ సీఎంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆనందపడ్డవారు ఎంతమంది ఉన్నారో? బాధపడ్డవారు కూడా అంతకు రెట్టింపు మందే ఉన్నారు. దశాబ్ధాలుగా తమను అలరించిన అభిమాన నటుడు ఇక వెండితెరపై కనిపించడా? ఆయన సినిమా కెరీర్ ముగిసినట్లేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వారి బాధను, ఆవేదనను పంచుకున్నారు. అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ ఇక నటించరా? అని బాధపడ్డారు.
పవన్ చేతిలో మూడు సినిమాలు
రాజకీయాల్లో పూర్తిగా దిగేనాటికి పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో వీరమల్లు దాదాపు ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్, తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఈ మూడు సినిమాలను వేగంగా పూర్తి చేయాలని భావించారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా కుదురుకోకముందే ముఖానికి మేకప్ వేసుకుని ప్రతిపక్షాల చేతికి అస్త్రాలు అందించకూడదని పవన్ భావించారు.

వచ్చే వారం హరిహర వీరమల్లు
ప్రస్తుతం పాలనాపరంగా కుదురుకోవడంతో హరిహర వీరమల్లు షూటింగ్‌తో పాటు డబ్బింగ్ పనులు పూర్తి చేసి జూలై 24న సినిమాను విడుదలకు సిద్ధం చేశారు పవన్ కళ్యాణ్. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ మంచి జోష్‌లో ఉన్నారు. హరిహర వీరమల్లును పూర్తి చేయడంతో ఓజీపై జనసేనాని ఫోకస్ పెట్టారు. సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీ షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ నిర్మాతలకు ఒత్తిడిని తగ్గించారు. ఈ సెప్టెంబర్ 25న ఓజీని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లో పవన్
రెండు సినిమాలు పూర్తి కావడంతో ఇక మిగిలిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కూడా ఫినిష్ చేయాలని పవర్ స్టార్ నిర్ణయించారు. దీనిలో భాగంగా గత నెలలో ఓజీ సెట్‌లో దిగారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తుండగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
స్టైలీష్ లుక్‌లో పవన్ కళ్యాణ్
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇళయ దళపతి విజయ్ నటించిన తేరికి తెలుగు రీమేక్‌గా దీనిని నిర్మిస్తున్నారు. అయితే మాతృకను మక్కీమక్కీకి దించకుండా హరీష్ దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మారుస్తున్నారు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ - శ్రీలీల సన్నివేశం తాలూకా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో శ్రీలీల పంజాబీ డ్రెస్‌లో ఉండగా.. పవన్ కళ్యాణ్ జీన్స్ ప్యాంట్, వైట్ టీషర్ట్ ధరించి బ్లాక్ గాగుల్స్‌తో స్టైలీష్‌గా ఉన్నారు. చూస్తుంటే పాత వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూస్తామని అభిమానులు ఎగ్జయిటింగ్‌తో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











