National Film Awards 2019: కీర్తి సురేష్, ఉత్తమ విజేతలకు పవన్ కల్యాణ్, జనసేన అభినందన..
జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమా చరిత్రలో మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో నటించిన కీర్తీ సురేష్‌కు ఉత్తమ జాతీయ నటి అవార్డు రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ప్రకటనను విడుదల చేశారు.
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన కీర్తీ సురేష్‌కు నా తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు. సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన మహానటి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్ నటన అవార్డుకు వందశాతం అర్హత ఉంది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి నిలిచినందున చిత్ర యూనిట్‌కు, రంగస్థలం, అ!, చిలసౌ చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు.

దేశవ్యాప్తంగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా పరిశ్రమకు ఏడు అవార్డులు రావడం అభినందనీయం. ఈ స్ఫూర్తిని తెలుగు సినీ పరిశ్రమ మరిన్నీ అవార్డులు రాబట్టాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కల్యాణ్, జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ అవార్డుల విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 'మహానటి', 'రంగస్థలం', 'అ!', చిలసౌ' చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి.


Click it and Unblock the Notifications











