Oscars for Naatu Naatu అతడి విజన్ వల్లే.. భారతీయులందరికి గర్వంగా.. పవన్, చిరంజీవి, నాగ్ ప్రశంసలు
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR చిత్రం భారతీయ సినిమా రంగంలో చరిత్ర సృష్టించింది. చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా.. కీరవాణి సంగీతం అందించారు. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుల్లో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం జరిగిన ఆస్కార్స్ అవార్డుల ప్రధానం వేడుకల్లో నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పురస్కారాన్ని గెలుచుకొన్నది. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, విజయ్ దేవరకొండ, రవితేజ తదితరులు సోషల్ మీడియాలో స్పందిస్తూ..
రాజమౌళి విజన్, ధైర్యం, పట్టుదల వల్లే
ఇండియాకు ఆస్కార్ రావడమేది ఒక కలలా ఉండేది. కానీ రాజమౌళి విజన్, ధైర్యం, పట్టుదల, అంకిత భావం వల్లే ఇది సాధ్య పడింది. కోట్లాగి మంది హృదయం గర్వంతో ఉప్పొంగుతున్నది. RRR సినిమాలో భాగమైన ప్రతీ ఒక్క సాంకేతిక నిపుణుడికి నా అభినందనలు అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

భారతీయులు గర్విస్తున్న క్షణాలివి
భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన RRR. చిత్ర సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి , గీత రచయిత శ్రీ చంద్రబోస్ హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన RRR చిత్రంలో 'నాటు నాటు...' గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు... అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది.
ఇంతటి ఘనత పొందేలా 'ఆర్.ఆర్.ఆర్.' చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్.టి.ఆర్., రాంచరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్యలకు అభినందనలు. RRR' చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

కృష్ణంరాజు చిరకాల స్వప్నం నెరవేరింది
ఆస్కార్స్ విషయంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు ఆయన సతీమణి శ్యామలాదేవి. రాజమౌళి గారి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' ఆస్కార్ నామినేషన్ అందుకోవడమే కాదు, సినిమాలోని 'నాటు నాటు' ఆస్కార్ అందుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట అవార్డు గెలుచుకోవడం, ఆస్కార్ వేదికపై కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకోవడం చూస్తుంటే నాకు కృష్ణంరాజు గారు చెప్పిన మాటలే గుర్తు వచ్చాయి. ఆయన ఎప్పుడూ తెలుగు సినిమాకి ఆస్కార్ రావాలని చాలా బలంగా కోరుకుంటూ ఉండేవారు.. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఈ సినిమాకి అనేక అవార్డులు వస్తాయని ఆయన ముందే ఊహించారు. అలాంటి కృష్ణంరాజు గారి బలమైన కోరికను రాజమౌళి అండ్ టీం నెరవేర్చింది. ఈ సినిమా చేసిన రాజమౌళి గారికి నిర్మాత దానయ్య గారికి శుభాభినందనలు. ఈ నాటు నాటు సాంగ్ మ్యూజిక్ అందించిన కీరవాణి గారికి సాహిత్యం అందించిన చంద్రబోస్, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ సాంగ్ కి స్టెప్పులు వేసిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వారి చేత స్టెప్పులు వేయించిన ప్రేమ్ రక్షిత్ లకు దీవెనలు.. ఈ పాట కోసం మీ అందరి కష్టం పాటకు ఇలాంటి గొప్ప అవార్డు తెచ్చి పెట్టేలా చేసింది. తెలుగు సినిమా ఇక్కడతో ఆగకుండా మరింత ముందుకు వెళ్లి మరిన్ని ఆస్కార్ అవార్డులు రాబోయే కాలంలో తీసుకురావాలని కోరుకుంటూ మీ శ్యామలా దేవి అంటూ ఓ ప్రకటనలో తెలిపారు.
చారిత్రాత్మక ఘట్టంగా
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతీయ సినిమా రంగంలో చారిత్రాత్మక ఘట్టం. మేమంత గర్వపడేలా చేశారు. కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, తారక్, రాంచరణ్, డీవీవీ దానయ్యకు ధన్యవాదాలు అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
విజయ్ దేవరకొండ రియాక్షన్
నాటు నాటు పాటకు ఆస్కార్స్ అవార్డు రావడంపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ.. బ్యూటీఫుల్, RRR, నాటు నాటు.. ఇండియన్ సినిమాకు, ఇండియాకు శుభపరిణామం. ఆస్కార్ రావడంతో మేమంత గర్వపడుతున్నాం. మేము కన్న అతిపెద్ద కల సాకారమైంది అని ట్వీట్ చేశారు.
తారక్, రాంచరణ్ లేకపోతే
RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై మాస్ మహారాజా రవితేజ స్పందించారు. డ్యాన్సింగ్ డైనమేట్స్ తారక్, రాంచరణ్ లేకపోతే ఇది అసాధ్యం. వారి వల్లనే ఆస్కార్ సాధ్యమైంది. రాజమౌళి అద్బుతమైన విజన్ వల్లే ఆస్కార్ వచ్చింది అని రవితేజ అన్నారు.
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు
RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సుకుమార్ స్పందించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో నోట మాటలు పెగలడం లేదు. ప్రపంచం మొత్త నాటు నాటు అంటూ నాట్యం చేస్తున్నది. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్‌కు నా అభినందనలు. భారతీయుందరినీ గ్వరంగా ఫీలయ్యేలా చేసిన టీమ్‌కు ధన్యవాదాలు అని సుకుమార్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











