AP Elections 2024: డిప్యూటీ సీఎం పదవిపై తేల్చేసిన పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ ఇచ్చిన క్లారిటీ ఇదే!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తమ కూటమి పార్టీలతో కలిసి ప్రభంజనం సృష్టించింది. పోటీ చేసిన 21 స్థానాల్లో అన్నింటిని గెలుచుకొని 100 శాతం స్ట్రైక్ రేట్‌ను సాధించింది. అయితే త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని చేపడుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే జాతీయ మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. డిప్యూటీ పదవిపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ విషయంలోకి వెళితే..
ఓటమి బాధ నుంచి బయటపడి ప్రజలు మంచి చేయాలన్న ఉద్దేశమే నన్ను విజయానికి చేరువగా చేసింది. నాలోని రాజీలేని పట్టుదల, నా కార్యకర్తలు, జనసైనికులు, అభిమానుల నాకు విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచి నాకు మనోస్థైర్యాన్ని ఇచ్చారు. అందువల్లే అసాధ్యంగా కనిపించే ఈ విజయం మాకు దక్కింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

పవర్ స్టార్, జనసేన ఛీఫ్..ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పదాలు నాకు అంతగా సంతోషాన్ని ఇవ్వవు. డిప్యూటీ సీఎం పదవి గురించి ఆలోచించడం లేదు. ఢిల్లీకి వెళ్లి ఎన్‌డీఏ మీటింగ్‌కు హాజరవుతాం. ఆ తర్వాత రాష్ట్రంలోని సమస్యలపై చర్చిస్తాం. అలాగే ప్రభుత్వంలో భాగస్వామ్యం గురించి ఆలోచిస్తాం. అప్పటి వరకు పదవుల గురించి ఆలోచించను అని పవన్ కల్యాణ్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
అధికారం చేపట్టాక నాకు పర్యావరణం విషయంలో దృష్టిపెట్టాలని అనుకొంటున్నాను. పర్యావరణ కాలుష్యం మానవాళికి ముప్పుగా మారింది. స్వచ్చమైన పర్యావరణం సమాజంలో ఉండేలా చర్యలు తీసుకొంటాం. ఇదే సొసైటీకి పెద్ద సమస్య. స్వచ్చమైన గాలి, సాగునీటి పారుదల విషయాలపై దృష్టిపెడుతాం అని పవన్ కల్యాణ్ తెలిపారు.

2019లో దారుణమైన ఓటమి తర్వాత నేను పెద్దగా ఆలోచించలేదు. నీవు ఏదైతే చేయాలని అనుకొంటున్నావో అది నిజాయితీగా చేసేయ్.. నీకు అదే మంచి ఫలితాన్ని అందిస్తుందని భావించాను. నీ సంకల్సం గట్టిగా ఉంటే ప్రకృతి నీకు సాయం చేస్తుందని నమ్మాను. నీకు ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తే.. ఇలాంటి ఫలితాలే వస్తాయని విశ్వసించాను అని పవన్ మరో ప్రశ్నకు జవాబిచ్చారు.
జనవాణి కార్యక్రమం నా విజన్‌ను ప్రజలకు చేరువగా చేసింది. ఏ పార్టీ నాయకుడైనా ప్రజలతో మమేకమై ఉండాలి. ప్రజల బాధలను అర్ధం చేసుకోవాలి. ప్రజల బాధల్లో భాగం కావాలి. ఆ విషయంలో జనవాణి కార్యక్రమం మాకు బాగా ఉపయోగపడింది అని జనసేన అధినేత చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి ప్రభంజనం ఉంటుందని ముందే ఊహించాను. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజలు తమ కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించకుండా మౌనంగా ఉంటారు. ఆ విషయాన్ని నేతలు గుర్తించాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని చేసిన నా ప్రయత్నాలు సఫలమయ్యాయి అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











