నేను పవనాన్ని.. నీది బావిలో కప్ప బతుకు.. వీరమల్లు ఈవెంట్‌లో రోజాకు పవన్ మాస్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి నేతలకు , విపక్ష వైసీపీ నేతలకు మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు జూలై 24న విడుదల కానున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం.. ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా తాజాగా పవన్ కళ్యాణ్ కౌంటరిచ్చారు.
సినిమాలను వదిలి రాజకీయాల్లోకి
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర, కేంద్ర రాజకీయాలలో ముఖ్య భూమిక పోషిస్తుండటంతో పాటు పాటు పాలనతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. వీటన్నింటిని అర్ధాంతరంగా పక్కనపెట్టి ఎన్నికల రణరంగంలో దిగారు జనసేనాని. దాంతో ఆ చిత్రాల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది.

సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్న పవన్
డిప్యూటీ సీఎంగా కుదురుకున్నాక తనకు వీలున్నప్పుడల్లా షూటింగ్స్‌లో పాల్గొంటూ హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్స్‌ను పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. జూలై 24న హరిహర వీరమల్లు రిలీజ్ నేపథ్యంలో నిర్మాత ప్రయోజనాలను కాపాడేందుకు, సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై విపక్ష వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా రోజా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఏ ఊరు వెళ్లినా అక్కడే పుట్టానంటాడు
ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఊగిపోయి సినిమా డైలాగులు చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత షూటింగ్లు, డబ్బింగ్‌లు చేసుకుంటూ తిరుగుతున్నారని రోజా దుయ్యబట్టారు. ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా? డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్‌లు చేసుకోవడానికా అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్‌కు మతిస్థిమితం లేదని.. ఆయన ఏ ఊరు వెళ్లినా, అక్కడే పుట్టానని, అక్కడే పెరిగానని చెబుతాడని సెటైర్లు వేశారు. తాజాగా రోజా వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు పవన్ కళ్యాణ్. జూలై 23న విశాఖపట్నంలో జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన వైసీపీ నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
రోజాకు పవన్ కౌంటర్
'విశాఖపట్నంతో నాది ప్రత్యేకమైన అనుబంధం. తెలిసినవాళ్లకు భీమిలిలో గెస్ట్ హౌస్ ఉండేది, నా ట్రైనింగ్ అంతా అక్కడే జరిగేది. మార్నింగ్ భీమిలి, సాయంత్రాలు సంగం శరత్ గెస్ట్ హౌస్‌లో శిక్షణ ఇచ్చేవారు. ఇలాంటివన్నీ చెబితే.. ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్లినా.. కనిగిరి వెళితే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్‌లో పెరిగానంటాడు. కానీ నేనేం చేయగలను.. నా పేరు పవనం, నేను తిరుగుతా ఉంటా. మనం పవనాలైతే అవి కూపస్థ మండూకాలు ఇలాగే మాట్లాడతాయి.. బావిలో కప్పలు. బావిలో కప్పలు గిరిగీసుకుని కూర్చొంటాయి.. పవనం తాలూకా శక్తి వాటికి అర్ధం కాదు. పవనం సర్వాంతర్యామి' అని రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











