Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అత్యంత అరుదైన గౌరవం.. ఇక పవర్ స్టార్ మాత్రమే కాదు..
టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. పవన్ కళ్యాణ్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా శాస్త్రీయ మార్షల్ ఆర్ట్స్ సాధకుడిగా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పవర్ స్టార్ ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన కెంజుట్సు (Kenjutsu) లో అధికారిక ప్రవేశం లభించడం అత్యంత విశేషంగా మారింది. మూడు దశాబ్దాలకు పైగా ఆయన కఠిన సాధన, పరిశోధన, నిబద్ధతకు ఇది అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా మార్షల్ ఆర్ట్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ గౌరవాన్ని పవన్ కళ్యాణ్‌కు కెనిన్ కై ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఇన్ స్టిట్యూషన్ (Kenjin Kai International Sword Institution) ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సంస్థకు చెందిన ప్రొఫెసర్, బుడో నిపుణుడు డాక్టర్ సయ్యద్ మహమూద్ సిద్ధిక్ మహమూదీ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ అధికారిక గుర్తింపు పత్రాన్ని స్వీకరించారు. సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

చెన్నైలో తన బాల్యంలో కరాటే, ఇతర యుద్ధ కళలలో శిక్షణ పొందారు. ఇందులో టెక్నిక్ ను ఔపోసన పట్టారు. సాంకేతికంగా అత్యుత్తమ స్థాయికి చేరుకున్నారు. శారీరకంగా ఎన్నో అడ్డంకులను అధిగమించారు. జపాన్ సమురాయ్ యుద్ధ కళ కేవలం శక్తి ప్రదర్శనకే పరిమితం కాకుండా, యుద్ధ కళల వెనుక ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలు, యుద్ధ తాత్వికత, జపాన్ సమురాయ్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది.
ఈ యుద్ధకళల పరిజ్ఞానం పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ స్పష్టంగా కనిపించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల్లో ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు అప్పట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. ముఖ్యంగా తమ్ముడు సినిమాలో బాక్సింగ్ శిక్షణ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన ఫైట్స్‌లో నిజమైన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ఉన్నాయని అప్పట్లో ట్రైనర్లు వెల్లడించారు. జపనీస్ సినిమాలకే పరిమితమైన కొన్ని యుద్ధకళలను తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేసిన తొలి హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు.
ఇంతకుముందే పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ రంగంలో అనేక అరుదైన గౌరవాలు లభించాయి. తాజాగా జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థగా పేరున్న సోగో బుడో కన్‌రి కై (Sogo Budo Kanri Kai) నుంచి ప్రతిష్టాత్మకమైన ఫిఫ్త్ డాన్ (5వ డాన్) అందుకున్న తొలి భారతీయ సినీ ప్రముఖుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అలాగే జపాన్ వెలుపల టకెడా షింగెన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు.
ఈ స్థాయి గౌరవాలు జపానేతరులకు దక్కడం చాలా అరుదైన విషయంగా పరిగణిస్తారు. అలాగే, తాజాగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గోల్డెన్ డ్రాగన్ (Golden Dragons) సంస్థ పవన్ కళ్యాణ్‌ను ' టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ (Tiger of Martial Arts)' అనే విశిష్ట బిరుదుతో సత్కరించింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్ బ్యానర్‌ను ప్రకటించడం, తన మార్షల్ ఆర్ట్స్ జర్నీని వీడియో రూపంలో అభిమానులతో పంచుకోవడం కూడా విశేష స్పందనను తెచ్చుకుంది. అంతేకాదు, పిఠాపురంలో మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించడం, ఈ విద్యను యువతకు చేరువ చేయాలనే సంకల్పాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కెంజుట్సులో లభించిన ఈ తాజా అంతర్జాతీయ గుర్తింపు ఆయనకు 'పవర్ స్టార్' అనే ఇమేజ్‌కు మించి, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ వేదికపై శాశ్వతంగా మార్షల్ ఆర్ట్స్ సాధకుడిగా కూడా నిలబెడుతుండటంతో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











