Ramoji No More: రామోజీ పెను సంచలనం.. పవన్ కల్యాణ్ సంతాపం.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు!
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత సీహెచ్ రామోజీరావు ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన శనివారం ఉదయం 3.45 గంటల ప్రాంతంలో ప్రముఖ హస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో మీడియా ప్రపంచం, పాఠక లోకం దిగ్బ్రాంతికి గురైంది. ఆయన లేని లోటు పూడ్చలేదని పలువురు తమ సంతపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామోజీ మరణ వార్త విన్న వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మీడియా మొఘల్ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ..
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. అక్షర యోధుడు శ్రీ రామోజీ రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. శ్రీ రామోజీ రావు గారు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు.

ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారు. వర్తమాన రాజకీయాలపై, పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు... ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం శ్రీ రామోజీరావు గారి దక్షతను తెలియచేసింది. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పత్రికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు.
రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ను వేదికగా చేశారు. మీడియా మొఘల్ గా శ్రీ రామోజీరావు గారు అలుపెరుగని పోరాటం చేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు.
అక్షర యోధుడు శ్రీ రామోజీ రావు గారు అస్తమయం తెలుగు ప్రజలందరినీ కలచి వేస్తోంది. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి. శ్రీ రామోజీరావు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని ఓ ప్రకటనలో పవన్ కల్యాణ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, రామోజీ రావు మరణ వార్త వినగానే.. ఢిల్లీలో తన అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకొని హైదరాబాద్ బయలుదేరారు. హైదారాబాద్ చేరుకుని శ్రీ రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు అని మీడియా వర్గం వెల్లడించారు.


Click it and Unblock the Notifications











