ఎస్పీ బాలు ఆత్మస్థైర్యం గొప్పది.. సంపూర్ణ ఆరోగ్యంతో వస్తారు.. పవన్ కల్యాణ్ ఎమోషనల్
ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తలతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే తన కుమారుడు తేజ, సోదరి వసంత స్పందిస్తూ.. ఆయన త్వరగా కోలుకొంటున్నారు. ఆయన ఆరోగ్యంగా నిలకడగా ఉందంటూ ప్రకటన చేశారు. ఈ వార్తల నేపథ్యంలో ఎస్పీ బాలుతో ఉన్న అనుబంధాన్ని వెల్లడిస్తూ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని ఓ ప్రకటనలో విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ తన ప్రకటనలో.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో మనోస్థైర్యం ఉన్నవారు. ఆయన ప్రస్తుత అనారోగ్య స్థితి నుంచి వీలైనంత త్వరగా కోలుకొంటారనే భావిస్తున్నాను. వీలైనంత త్వరగా మనముందుకు వస్తారనే విశ్వాసం నాకు ఉంది.

చెన్నైలో వెంటిలేటర్‌పై ఉన్నారనే వార్త తెలియగానే తెలియగానే ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న ఆయన తప్పకుండా కోలుకొంటారని భావించాను. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది నాకు, అభిమానులందరికీ ఊరటనిచ్చే వార్త ఇది. బాలు గారితో మా కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తన ప్రకటనలో తెలిపారు.
బాలు గారి ఆరోగ్యంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అన్ని అవయవాల పనితీరు బాగుందని వైద్యులు వెల్లడించారు. విషమ పరిస్థితి నుంచి కోలుకొనే సూచనలు ఉన్నాయనే విశ్వాసాన్ని వైద్యులు ప్రకటించారు. బాలు గారు చికిత్సకు స్పందిస్తున్న తీరుపై వైద్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు. మీ అందరి ప్రార్థనలు, ఆశీస్సులతో మన బాలు గారు పరిపూర్ణమైన ఆరోగ్యం తో మన అందరినీ ఎప్పటిలాగే ఆయన పాటలతో అలరిస్తారని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని శివలెంక కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











